ఎంఎల్ఏ ఈటల రాజేందర్ ను బీజేపీ అధిష్టానం బుజ్జగిస్తోంది. పార్టీ చేరికల కమిటి ఛైర్మన్ గా ఈటల ఒక విధంగా ఫెయిలయ్యారనే చెప్పాలి. ఈయన నాయకత్వంలో ఇతర పార్టీల్లోనుండి చెప్పుకోదగ్గనేతలెవరూ బీజేపీలో చేరలేదు. మహబూబ్ నగర్ కు చెందిన మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసులరెడ్డి పార్టీలోకి వస్తారని అనుకుంటే చివరకు వాళ్ళు కూడా రావటంలేదు. వీళ్ళిద్దరినీ ఎలాగైనా పార్టీలోకి చేర్చుకోవాలని ఈటల ఎంతప్రయత్నించినా ఉపయోగం కనబడలేదు.
ఇదే విషయాన్ని ఈటల ఈ మధ్య ఆఫ్ ది రికార్డుగా చెప్పారు. తాము ఎంత ప్రయత్నించినా వాళ్ళిద్దరు పార్టీలో చేరడానికి ఇష్టపడలేదన్నారు. బీజేపీలో చేరడానికి జూపల్లి, పొంగులేటికి ఏదో సమస్య ఉన్నట్లు ఈటల అభిప్రాయపడ్డారు. అసలు పార్టీలో తన పరిస్థితి ఏమిటో తనకే అర్ధం కావటం లేదని కూడా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలన్నీ అధిష్టానం దృష్టికి వెళ్ళాయి. దాంతో వెంటనే అధిష్టానం రంగంలోకి దిగింది. పార్టీలో చేరికల కమిటికి ఛైర్మన్ గా కంటిన్యూ అవ్వాల్సిందే అని ఈటలను గట్టిగా కోరింది.
ఇతర పార్టీల్లో నుండి నేతలను చేర్పించే విషయంలో ప్రయత్నాలను ఎట్టి పరిస్ధితుల్లోను ఆపవద్దని కోరింది. దాంతో ఇపుడు ఈటల విషయం పార్టీలో చర్చనీయాంశమైంది. కారణం ఏమిటంటే ఈటలకు పార్టీ చీఫ్ బండి సంజయ్ కు ఏమాత్రం పడటంలేదనే ప్రచారం అందరికీ తెలిసిందే. పార్టీలోకి ఎవరినైనా తీసుకురావాలంటే ముఖ్యంగా వాళ్ళకి రాబోయే ఎన్నికల్లో టికెట్ హామీ ఇవ్వాలి. ఆ హామీని ఈటల ఇవ్వలేకపోతున్నారు. పార్టీ చీఫ్ గా బండి ఉండగా సొంతంగా ఈటల టికెట్ హామీ ఇవ్వలేరు.
అంటే ప్రతి చేరిక విషయంలోను ఈటల పార్టీ చీఫ్ అనుమతి తీసుకోవాల్సిందే. అభ్యర్థుల విషయంలో ఈటల, బండి ఆలోచనలు వేర్వేరుగా ఉన్నాయట. దాంతో ఇద్దరి మధ్య సమస్యలు పెరిగిపోతున్నాయట. అందుకనే బీజేపీలో చేరడానికి ఎవరూ ముందుకు రావటంలేదు. పైగా కర్నాటకలో కాంగ్రెస్ సాధించిన ఘనవిజయం కూడా ప్రధాన కారణమైంది. కర్నాటకలో గెలుపుతో తెలంగాణాలో కాంగ్రెస్ నేతల్లో జోష్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఈ కారణంగా కూడా నేతలెవరూ బీజేపీ వైపు చూడటం లేదు. అనేక కారణాల వల్ల ఈటల కూడా ఎక్కడ జారిపోతారో అన్న ఉద్దేశ్యంతో అధిష్టానం బుజ్జగింపులకు దిగినట్లుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates