వైసీపీలోకి కేశినేని:  కీల‌క ఎంపీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఏపీలో రాజ‌కీయ ప‌రిణామాలు వేడెక్కాయి. ముఖ్యంగా విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నాని చుట్టు ఇప్పుడు రాజ‌కీయం చ‌క్క‌ర్లు కొడుతోంది. టీడీపీ అధినేత చంద్ర‌బాబు రాజ‌మండ్రిలో  మ‌హానాడు నిర్వ‌హించిన త‌ర్వాత‌ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఎన్నికల వేళ ప్రధాన పార్టీలు వ్యూహాలు మారుస్తున్నాయి. విజయవాడ ఎంపీ కేశినేని వ్యవహారం పార్టీలో వివాదాస్పదంగా కనిపిస్తోంది. వైసీపీ ఎమ్మెల్యేపై కేశినేని ప్రశంసలు.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడంపై ఆయన చేసిన వ్యాఖ్యలతో టీడీపీలో కలకలం మొదలైంది.

కొందరు టీడీపీ నేతలు కేశినేనిపై విరుచుకుపడుతున్నారు. కేశినేని నాని వ్యాఖ్యలతో విజయవాడ ఎంపీ కేశినేని నాని వర్సెస్ స్థానిక టీడీపీ నేతలు అన్నట్లుగా మారిపోయింది.  అదే సమయంలో వచ్చే ఎన్నికల్లో సీటు ఇవ్వకుంటే కేశినేని భవన్‌లో కూర్చుని సేవా కార్యక్రమాలను కొనసాగిస్తానని కూడా వ్యాఖ్యానించి కాకరేపారు.  అయితే, ఎంపీ కేశినేని నాని వ్యవహారంలో వైసీపీ ఎంపీ అయోధ్య రామిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారాయి.

టీడీపీ ఎంపీ కేశినేని నాని మంచి మనిషి అని ప్రశంసలు కురిపించిన ఆళ్ల అయోధ్య రామిరెడ్డి త‌న‌కు నాని మంచి మిత్రుడు కూడా అని చెప్పారు. అంతేకాదు.. ఆయన వైసీపీలోకి వస్తే చాలా సంతోషం అని పేర్కొన్నారు.  ఎంపీ కేశినేని నాని ప్రజల కోసం పనిచేస్తాడని చెప్పారు. కష్టాల్లో ఉన్నవారి కోసం నాని ఎప్పుడూ పనిచేస్తాడన్నారు. వైసీపీలోకి కేశినేని వస్తే స్వాగతిస్తామని ప్రకటించారు. ప్రభుత్వం అనేది తల్లి తండ్రి లాంటిది.. ప్రజలకు మంచి చేద్దాం అనుకునే నాయకుల మాదిరి పిల్లలు ఉంటే వారికి అండగా ఉండేదే ప్రభుత్వం అన్నారు.