ఉమ్మడి గుంటూరు జిల్లాలోని ఉండవల్లి కరకట్టపై ఉన్న చంద్రబాబు అద్దె నివాసాన్ని ఇటీవల ఏపీ ప్రభుత్వం జప్తు చేస్తూ.. ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని లింగమనేని ఎస్టేట్స్ కోర్టులో సవాల్ చేసింది. దీనికి సంబంధించి ఇరుపక్షాల వాదనలు విన్న ఏసీబీ కోర్టు న్యాయమూర్తి బిందుమాధవి.. తీర్పు జూన్ 2న వెలువరించనున్నారు. కాగా కరకట్టపై చంద్రబాబు ఇల్లు జప్తునకు అనుమతి కోరుతూ ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు సీఆర్డీయే మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్‌లలో లింగమనేనికి లబ్ది చేకూర్చి బదులుగా ఆయన ఇంటిని గెస్ట్ హౌస్‌గా పొందారని సీఐడీ అభియోగాలు మోపింది. కరకట్టపై చంద్రబాబు నివాసం ఉంటున్న లింగమనేని రమేష్ ఇంటిని జప్తు చేసేందుకు అనుమతివ్వాలని కోరింది. సీఐడీ తరపు న్యాయవాది వివేకానంద మాట్లాడుతూ.. ఏపీ సీఐడీ తరపున 2 పిటిషన్లను ఏసీబీ కోర్టులో దాఖలు చేశామని తెలిపారు.
లింగమనేని రమేష్ ఇల్లు అటాచ్ మెంట్ పిటిషన్ ఒకటి కాగా, మాజీమంత్రి నారాయణ బంధువుల ఆస్తుల జప్తు పిటిషన్ మరొకటని తెలిపారు. 1944 ఆర్డినెన్స్ ప్రకారం తన పిటిషన్‌పై ఆర్డర్ ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. నేరం జరిగిందా లేదా అనేది తెలుసుకునేందుకు అవసరమైతే అఫిడవిట్ వేసిన అధికారిని కోర్టు విచారణ చేయవచ్చని చెప్పినట్లు పేర్కొన్నారు. ఈ దశలో ప్రతివాదులకు నోటీసు ఇచ్చే అవకాశం లేదని చెప్పినట్లు తెలిపారు. జప్తు ఉత్తర్వులు ఇవ్వటమా, నిరాకరించటమా అనేది ఆదేశాలు వచ్చిన తర్వాత ప్రతివాదులకు నోటీసులు ఇవ్వాలని కోరినట్లు చెప్పారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates