ఈటల చుట్టూ మంటలు

మాట్లాడేప్పుడు జాగ్రత్తగా ఉండకపోతే మంటలు మండటం ఖాయం. ఇప్పుడు బీజేపీ నేత ఈటల రాజేందర్ వ్యవహారం అలాగే తయారైంది. ఓ మాదిరి నేలతంతా ఇపుడు ఈటల వ్యవహారశైలిపై మండిపోతున్నారు.  మీడియాతో మాట్లాడుతు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు బీజేపీలో చేరకపోవచ్చని చెప్పారు. కారణం ఏమిటంటే వాళ్ళిద్దరికీ బీజేపీలో చేరటానికి ఏవో ఇబ్బందులు ఉన్నట్లుగా ఈటల అనుమానం వ్యక్తంచేశారు. ఇంతటితో ఊరుకోకుండా వీళ్ళిద్దరు కాంగ్రెస్ లో చేరవచ్చని కూడా చెప్పారు.

ఇక్కడే ఈటల మాటలపై మంటలు మొదలయ్యాయి. ఎందుకంటే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో జూపల్లి బాగా సీనియర్ నేత. ఇదే సమయంలో ఖమ్మంకు చెందిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి చాలా బలమైన నేత. పొంగులేటికి ఆర్ధిక, అంగబలం చాలా ఎక్కువ. పొంగులేటి ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ నిధులకోసం వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు. వేలకోట్ల రూపాయల కాంట్రాక్టులు చేస్తున్నారు. కాబట్టి ఎన్నికల్లో అవసరమైతే ఎంత డబ్బయినా ఖర్చుచేయటానికి వెనకాడరు.

ఇలాంటి పొంగులేటిని దూరం చేసుకుని కేసీయార్ తప్పుచేశారనే ప్రచారం బలంగా జరుగుతోంది. అందుకనే మాజీఎంపీని తమపార్టీలో చేర్చుకునేందుకు కాంగ్రెస్, బీజేపీలు ప్రయత్నిస్తున్నాయి. ఇక్కడ విషయం ఏమిటంటే పొంగులేటి, జూపల్లితో మాట్లాడింది ఈటలే. ఎందుకంటే బీజేపీలో చేరికల కమిటికి ఛైర్మన్ ఈటలే అన్నవిషయం తెలిసిందే. కమిటి ఛైర్మన్ పై ఇద్దరు నేతలు బీజేపీలో చేరరని చెప్పి కాంగ్రెస్ లో చేరే అవకాశాలున్నాయని చెప్పటం ఏమిటి ?

ఈటల బాధ్యత ఇతరపార్టీల్లోని నేతలను బీజేపీలో చేరేట్లుగా ఒప్పించటమే. ఇతర నేతలను పార్టీలోకి రప్పించేందుకు ఈటల తనవంతు ప్రయత్నాలను తానుచేయాలి. చేరటం చేరకపోవటం ఆ నేతలిష్టం. ఇపుడు పొంగులేటి, జూపల్లి బీజేపీలో చేరకపోయినా పర్వాలేదు. కాంగ్రెస్ లో చేరితే బీజేపీ నేతలు ఎవరూ చేయగలిగేది కూడా ఏమీలేదు. కానీ ఆ నేతలిద్దరు బీజేపీలో చేరరని, కాంగ్రెస్ లో చేరుతారని ఈటలే స్వయంగా చెప్పటం ఏమిటో అర్ధంకావటంలేదు. పైగా ఖమ్మం జిల్లాలో బీజేపీ బలహీనంగా ఉందని వ్యాఖ్యానించారు. ఈ మాటల మీదే ఈటల చుట్టూ మంటలు మండుతున్నాయి.