మోడీజీ.. ప‌త‌కాలు.. గంగ‌లో క‌లిపేస్తా: రెజ్ల‌ర్ల హెచ్చ‌రిక

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ సెంట్రిక్‌గా రెజ‌ర్లు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. “మోడీ జీ.. మా బాధ‌లు మీకు ప‌ట్ట‌డం లేదు. ఈ దేశం కోసం అహ‌ర్నిశ‌లూ శ్ర‌మించి అంత‌ర్జాతీయ స్థాయిలో ప‌త‌కాలు సంపాయించాం. మీరు మాపై చూపిస్తున్న `అవ్యాజ‌మైన ప్రేమ‌`కు నిద‌ర్శ‌నంగా వాటిని మీ నియోజ‌క‌వ‌ర్గంలోని గంగా న‌దిలోనే క‌లిపేస్తాం” అని వారు హెచ్చ‌రించారు. అయితే.. ఈ ప్ర‌క‌ట‌న‌ను యూపీలోని బీజేపీ ప్ర‌భుత్వం స్వాగ‌తించడం మ‌రింత వివాదంగా మారింది.  వీరిని తాము అడ్డుకోబోమని హరిద్వార్ పోలీసులు స్పష్టం చేశారు.

ఏంటీ వివాదం..

రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాచీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ఓ మైనర్‌తో సహా కొందరు మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని రెజ్లర్లు ఆరోపిస్తున్నారు. వీరు ఈ ఏడాది ఏప్రిల్ 23 నుంచి నిరసన తెలుపుతున్నారు. అయితే.. వీరి ఆందోళ‌న‌పై అటు కేంద్రం కానీ.. ఇటు ఫెడ‌రేష‌న్ కానీ.. పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. దీంతో ఇటీవ‌ల నూన‌త పార్ల‌మెంటు భ‌వ‌నాన్ని ప్రారంభించే స‌మ‌యంలో అక్క‌డే నిర‌స‌న తెల‌పాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఇది తీవ్ర వివాదంగా మారి.. అరెస్టుల వ‌రకు దారితీసింది.

బ్రిజ్ భూషణ్‌‌ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు రెజ్లర్లు సాక్షి మాలిక్, బజరంగ్ పూనియా, వినేష్ ఫోగట్ తదితరులు ఆరోపిస్తున్నారు. ఆయనను తక్షణమే అరెస్ట్ చేయాలని  డిమాండ్ చేస్తున్నారు. న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వారాల త‌ర‌బ‌డి ధర్నా చేస్తున్నారు. వీరికి రైతు సంఘాలు కూడా మద్దతు ప్రకటించాయి. సాక్షి మాలిక్, బజరంగ్ పూనియా, వినేష్ ఫోగట్ విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో, రెజ్లర్లు హరిద్వార్‌లోని గంగా నదిలో తమ పతకాలను నిమజ్జనం చేస్తామ‌ని చెప్పారు.

ఈ పతకాలు తమ ప్రాణమని, తమ ఆత్మ అని రెజ్ల‌ర్లు చెప్పారు. వీటిని గంగా నదిలోకి విసిరేసిన తర్వాత జీవించి ఉండటంలో అర్థం లేదన్నారు. వీటిని గంగా నదిలో కలిపేసిన తర్వాత తాము ఇండియా గేట్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని చెప్పారు. అయితే.. హరిద్వార్ సీనియర్ పోలీస్ సూపరింటెండెంట్ అజయ్ సింగ్ మాట్లాడుతూ, రెజ్లర్లు తమకు నచ్చిన పని చేయవచ్చునని తెలిపారు. పవిత్రమైన గంగా నదిలో వారు తమ పతకాలను నిమజ్జనం చేసేందుకు వస్తే, తాము వారిని ఆపబోమని తెలిపారు.