పార్టీలోకి రమ్మని అడిగితే.. తమతో రమ్మన్నారట

రాజకీయ లెక్కలు మారుతున్నాయి. గతానికి భిన్నమైన రాజకీయం ఇప్పుడు కనిపిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అదే పరిస్థితి. ఏ పార్టీలో చేరాలన్న దానిపై నిర్ణయం తీసుకోకుండా.. విపక్షాల్ని ఊరిస్తున్న పొంగులేటి.. జూపల్లిల ఉదంతంలో కొత్త సీన్ ఒకటి బయటకు వచ్చింది. ఈ ఇద్దరు నేతల్ని తమ పార్టీలోకి తీసుకుంటే మరింత బలోపేతం అవుతాయన్న ఆలోచనలో ఉన్నాయి బీజేపీ.. కాంగ్రెస్ పార్టీలు. అందుకు తగ్గట్లే పెద్ద ఎత్తున ప్రయత్నాలు సాగుతున్నాయి.

బీఆర్ఎస్ నుంచి వేటు పడిన అనంతరం.. గులాబీ తోట నుంచి బయటకు వచ్చేసిన ఈ ఇద్దరు నేతల్ని ఒడుపుగా పట్టుకొని తమ కండువాలు వేసేందుకు కాంగ్రెస్..కమలం పార్టీలు ఒకరికి మించి మరొకరు అన్నట్లుగా ప్రయత్నాలు చేయటం తెలిసిందే. ఇలాంటి క్రమంలో చోటు చేసుకున్న పరిణామాల గురించి బీజేపీ నేతల ఈటల రాజేందర్ నోటి నుంచి వచ్చిన మాటలు ఆసక్తికరంగా మారాయి. తమ పార్టీలోకి రావాలని కోరిన జూపల్లి.. పొంగులేటి తనకే రివర్సు కౌన్సెలింగ్ ఇస్తున్నారంటూ ఈటల వ్యాఖ్యానించటం తెలిసిందే.

బీజేపీ చేరికల కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ వారితో పలుమార్లు భేటీ కావటం.. గంటల కొద్దీ చర్చలు జరపటం తెలిసిందే. బీజేపీలో వారు చేరేందుకు తాను చేయగిలినంత చేసిన ఈటలకు ఈ ఇద్దరు నేతలు చివర్లో షాకిచ్చారు. ఇద్దరునేతల్ని బీజేపీలో చేరేలా ఒప్పించేందుకు తన వంతు ప్రయత్నాలు తాను చేశానని.. కానీ, వారు బీజేపీలో చేరతానని చెప్పకపోగా.. తనకే రివర్సు కౌన్సెలింగ్ ఇస్తున్నట్లుగా ఈటెల వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే తాజాగా జూపల్లి క్రిష్ణారావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తాము బీజేపీలోకి వెళ్లటం కాదని.. ఈటలనే తమతో పాటు రావాలని కోరినట్లుగా చెప్పటం గమనార్హం. కేసీఆర్ ను గద్దె దించటమే లక్ష్యమని.. వచ్చే నెలలో తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామని చెప్పిన ఆయన.. తమతో పాటు అందరూ కలిసి రావాలని కోరతున్నట్లు చెప్పారు. మారిన రాజకీయాలకు తాజా ఉదంతం ఒక కొత్త ఉదాహరణగా చెప్పాలి. పార్టీలో రావాలని కోరిన వారికే.. రివర్సుగేరులో ఆఫర్లు ఇస్తున్న నేతల తీరు తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఆసక్తికర చర్చ నడుస్తోంది.