రాజకీయాల్లో పాపం కొందరు ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. ఎన్ని రోజులు ఎదురుచూసినా వాళ్ల ఆశలు నెరవేరవు. చివరకు ఉన్న దాంట్లో సర్దుకుపోదాములే అనుకుని ఊరుకుంటారు. బీజేపీ ఆంధ్రప్రదేశ్ నాయకులు, విశాఖ నార్త్ మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు పరిస్థితి కూడా అంతే.
నిజానికి విష్ణు కుమార్ రాజు బీజేపీలో క్రియాశీల సభ్యుడు. పార్టీ లైన్లోనే ఉండేవారు. 2019లో ఓడిపోయిన తర్వాత ఏపీలో బీజేపీకి మనుగడ లేదని ఆయన అనిపించి ఉండొచ్చు. దానితో ఆయనకు పార్టీకు దూరం జరగాలన్న ఆలోచన వచ్చినట్లు చెబుతారు. టీడీపీకి దగ్గరైతే మళ్లీ విశాఖ నార్త్ సీటు దక్కుతుందని ఎమ్మెల్యే అయ్యే అవకాశం వస్తుందని కూడా ఎదురు చూశారు. ఆ దిశగా టీడీపీకి సంకేతాలు పంపారు.
విష్ణు కుమార్ రాజు కొన్ని మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇచ్చే క్రమంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఛ..ఛ.. విశాఖ రాజధాని మాకు వద్దే వద్దు అన్న మాటలను వైసీపీ బాగానే ఎక్స్ పోజ్ చేసింది. బీజేపీలోని ఒక వర్గం విష్ణుపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసింది. తొలుత విష్ణు వాటిని పట్టించుకోలేదు. సైకిలెక్కాలన్న ఆలోచనలో ఉన్నందున లెక్కచేయలేదు.
కట్ చేసి చూస్తే విష్ణును టీడీపీ అధినేత చంద్రబాబు పట్టించుకున్న దాఖలాలు కనిపించలేదు. అందుకు కారణాలు లేకపోలేదు. టీడీపీ ఇప్పటికే రద్దీ ఎక్కువైన పార్టీగా మారింది. అందులోనూ విశాఖలో కుటుంబాలకు కుటుంబాలే టీడీపీని దశాబ్దాలుగా నమ్ముకుని ఉన్నాయి. దానితో విష్ణుకు చంద్రబాబు ఎలాంటి హామీ ఇవ్వలేకపోయారు. ఇక చేసేదేమీ లేక ప్రస్తుతానికి బీజేపీలోనే ఉండిపోవాలని విష్ణు నిర్ణయించుకున్నారు. తనకు అధిష్టానం పంపిన షో కాజ్ నోటీసుకు మర్యాదగా సమాధానం రాశారు. అంతకంటే ఏం చేస్తారు మరి…