టీడీపీతో పొత్తుపై బీజేపీ మెత్తపడుతోందా ?

రాబోయే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకునే విషయంలో బీజేపీ వైఖరిలో మార్పు వస్తోందనే అనిపిస్తోంది. వైజాగ్ లో మీడియాతో మాట్లాడినపుడు అధ్యక్షుడు సోమువీర్రాజు చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. బీజేపీ, జనసేన, టీడీపీలు పొత్తుపెట్టుకునే అంశంపై బీజేపీలో చర్చలు జరగటంలో తప్పేమీలేదన్నారు. మొన్నటివరకు అసలు చంద్రబాబునాయుడుతో పొత్తు ప్రసక్తే లేదని ఇదే వీర్రాజు ఎన్నిసార్లు కుండలుబద్దలు కొట్టకుండా చెప్పారో అందరు చూసిందే. కుటుంబ పార్టీలతో బీజేపీ పొత్తు పెట్టుకునే సమస్యేలేదని పదేపదే చెప్పారు.

అలాంటిది ఇపుడు టీడీపీతో పొత్తుపెట్టుకునే విషయమై తమ పార్టీలో చర్చలు జరగటంలో తప్పులేదని అనటంలో అర్ధమేంటి ?  అంటే వీర్రాజు మాటలను బట్టి రేపటి ఎన్నికల్లో టీడీపీతో పొత్తుపెట్టుకునే అవకాశాలను కొట్టేసేందుకు లేదని అర్ధమవుతోంది. వ్యవహారం ఇంతదాకా వస్తే పొత్తు పెట్టుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే అనుకోవాలి. ఎందుకంటే బీజేపీ మిత్రపక్షం జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇదే విషయాన్ని పదేపదే ప్రస్తావిస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా ఉండాలంటే ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి రావాలని పవన్ చాలాసార్లు బహిరంగ సభల్లోనే చెప్పారు.

అయితే ప్రతిపక్షాలు ఏకతాటిపైకి రావాలని చెప్పటంలో పవన్ ఉద్దేశ్యం ఏమిటంటే టీడీపీతో పొత్తు పెట్టుకోవటమే. కాంగ్రెస్, వామపక్షాలు అప్పుడు ఒంటరిగానే పోటీచేయాల్సుంటుంది. లేకపోతే కాంగ్రెస్, వామపక్షాలు పొత్తు పెట్టుకుంటాయేమో చూడాలి. అంటే అప్పుడు కూడా వైసీపీ-టీడీపీ, బీజేపీ,జనసేన-కాంగ్రెస్, వామపక్షాల తరపున అభ్యర్థులు రంగంలో ఉంటారు. అప్పుడైనా ప్రతిపక్షాల మధ్య ఓట్ల చీలికను నివారించటం పవన్ వల్ల కాదని తేలిపోతోంది.

కాకపోతే వామపక్షాలు, కాంగ్రెస్ ఓటు బ్యాంకు దాదాపు నిల్లన్న విషయం తెలిసిందే. అందుకనే పవన్ కూడా ధైర్యంగా టీడీపీ, జనసేన, బీజేపీ కలవాలని చెబుతున్నది. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏమంటే పొత్తులు పెట్టుకోవాలని నిర్ణయం తీసుకున్నంత తేలికకాదు ఆచరణలోకి రావటం. మూడుపార్టీలు త్యాగాలకు సిద్ధపడితేనే పొత్తులు సజావుగా జరుగుతుంది.  ఆ తర్వాత జనాలను మెప్పించటం, ఓట్ల బదిలీ అన్నదాని గురించి ఆలోచించాలి. ఏదేమైనా పొత్తులపై నిర్ణయం జాతీయపార్టీదే అని వీర్రాజు చెబుతున్నారు కాబట్టి నరేంద్రమోడీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సిందే.