ఏపీలో సీఎం జగన్ పాలనపై హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పాలనపై విమర్శనాస్త్రాలు సంధించారు. టీడీపీ మహానాడు, ఎన్టీఆర్ శతజయంతి వేడుకల సందర్భంగా రాజమహేంద్రవరాన్ని పసుపుమయం చేసిన పార్టీ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం బాలకృష్ణ ఉద్వేగ భరితంగా ప్రసంగిస్తూ.. ప్రజల వద్దకు పాలన తెచ్చిన ఘనత దివంగత ఎన్టీఆర్‌దేనని అన్నారు. ఆనాడు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా కొనసాగిన రోజుల్లో బీసీలకు, మహిళలకు, తెలుగు భాషకు వన్నె తెచ్చారని గుర్తు చేశారు.
‘ఆనాడు ఇదే రాజమహేంద్రవరంలో తెలుగువారికి మొదటి కావ్యాన్ని అందించాలని నన్నయ ఆంధ్రభారత సంహిత రచనకు ఆద్యుడయ్యాడు. అటువంటి ప్రశస్తమైన ప్రాంగణంలో మహానాడు, ఎన్టీఆర్ శతజయంతిని జరుపుకోవటం ఎంతో సంతోషంగా ఉంది. ఎటు చూసినా పసుపు మయం చేసిన కార్యకర్తలకు ధన్యవాదాలు. ప్రజల వద్దకు పాలన తెచ్చిన ఘనత ఎన్టీఆర్‌దే. చంద్రబాబు విజన్.. ఎన్నో రాష్ట్రాలకు ఆదర్శమైంది. వైసీపీ పాలనలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయి. బాదుడే బాదుడు పేరుతో అన్ని వస్తువుల ధరలు పెంచారు. 3 రాజధానుల పేరుతో కాలం వెళ్లదీస్తున్నారు. జగన్ పాలనలో కొత్త పరిశ్రమలు రావడం లేదు. తెలుగువారి కలల రాజధాని అమరావతిని పక్కనపెట్టారు.” అని బాలయ్య నిప్పులు చెరిగారు.
ఎన్టీఆర్.. ప్రజల గుండెల్లో శాశ్వతమైన స్థానాన్ని సంపాదించారని బాలకృష్ణ పేర్కొన్నారు. పాలనా పరంగా ఆయన ఎన్నో సాహసోపేతమైన పథకాలు ప్రవేశపెట్టారన్నారు. సినిమా పరంగా నటనలో ఎన్నో ప్రయోగాలు చేసిన ఘనత కూడా ఎన్టీఆర్ దేనని వివరించారు. తాను ఒక తెలుగువాడినని గర్వంగా చెప్పుకునేందుకు ధైర్యం ఇచ్చింది కూడా ఎన్టీఆరేనని బాలకృష్ణ గుర్తు చేశారు. ఎన్టీఆర్.. ఆనాడు తెలుగుదేశం పార్టీని స్థాపించి.. ఎందరికో రాజకీయ భిక్ష పెట్టారన్నారు.
ఎన్టీఆర్ గురించి ఎన్నిసార్లు మాట్లాడినా, ఎంత చెప్పిన తనివి తీరదని ఆయన వెల్లడించారు. చివరగా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో నిజాయితీతో, క్రమశిక్షణతో తెలుగుదేశం పార్టీ ఎన్నో ఏళ్లుగా ముందుకు సాగుతుందని బాలకృష్ణ వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో పార్టీని గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని.. చెప్పారు. దుష్ట సంహారానికి పురాణాల రోజుల్లో ఆయుధాలు దేవుడు దిగివచ్చేవాడు. కానీ, ఇప్పుడు ఓటు అనే ఆయుధంతో మీరు విరుచుకుపడాలి. దుష్టపాలన నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలంటే టీడీపీకి ఓటు వేయాలి.. అని బాలయ్య పిలుపునిచ్చారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates