ఎన్టీఆర్ 100 – అనితరసాధ్యమైన కీర్తిశిఖరం

ఎందరో మహానుభావులు. కానీ కొందరే చరితార్థులు. వాళ్ళలో ఎన్టీఆర్ ది ప్రత్యేక స్థానం. తెలుగు సినిమా పుట్టినప్పటి నుంచి ఎందరో గొప్ప నటీనటులను చూసింది. కానీ ప్రేక్షకుల మీద విపరీతమైన ప్రభావం చూపించి దశాబ్దాలు కాదు శతాబ్దాలు గడిచినా చెక్కుచెదరని స్థానం సంపాదించుకోవడం ఎన్టీఆర్ లాంటి అతి కొందరికే సాధ్యమయ్యింది. కేవలం సినిమాల్లో నటించడం వల్ల ఆ ఘనతను అందుకోలేదు . అనితరసాధ్యమైన నట సాహసాలకు నెలవుగా నిలవడం వల్లే విశ్వవిజేతగా నిలిచారు. శతజయంతి సందర్భంగా అవన్నీ చెప్పుకోవడం కష్టమే అయినా ఎన్టీఆర్ జీవన చిత్రాన్ని గొప్పగా ఆవిష్కరించే టాప్ 5 అంశాల గురించి ప్రస్తావించుకుందాం

సినిమా

ఒకప్పటి శ్రీకృష్ణుడి రూపం ఎలా ఉంటుందో తెలియదు కానీ మాయాబజార్ వచ్చాక ఎన్టీఆర్ తప్ప మరొకరు ఆ పాత్రకు ప్రాణప్రతిష్ట చేయలేకపోయారు. లవకుశలో రాముడిగా చూశాక లక్షలాది ఇళ్లలో గోడ మీద ఫోటో రూపంలో స్థానం సంపాదించుకున్నారు. వేటగాడులో అల్లరి చేసినా, సర్దార్ పాపారాయుడులో బ్రిటిషర్ల మీద తిరుగుబాటు జెండా ఎగరవేసినా, బడి పంతులులో కుటుంబ బాధ్యతల్లో నలిగిపోయిన ముసలాయనగా పరకాయప్రవేశం చేసినా ఆయనకే చెల్లింది. భూకైలాస్ లో రావణుడు, దక్షయజ్ఞంలో శివుడు, పాండవ వనవాసంలో భీముడు ఆపై అక్బర్, చంద్రగుప్తుడు, అశోకుడు ఇలా చెప్పుకుంటూ పోతే అలుపు రావడం తప్ప ప్రవాహం ఆగదు

దర్శకత్వం

కర్ణుడు, దుర్యోధనుడు, శ్రీకృష్ణుడు ఇలా మూడు పాత్రలను ఒకేసారి పోషిస్తూ ఒకపక్క నిర్మాణం మరోవైపు దర్శకత్వం వీటితో పాటు వందలాది ఆర్టిస్టులతో అనుసంధానం చేసుకుంటూ కేవలం రెండు నెలల్లో నాలుగు గంటల దానవీరశూరకర్ణ సినిమా తీయడం ఒక్క ఎన్టీఆర్ కు మాత్రమే సాధ్యమైన అద్భుతం. సీతారామ కళ్యాణం. గులేబకావళి కథ లాంటి ఎన్నో క్లాసిక్స్ ని నేషనల్ ఆర్ట్స్ థియేటర్స్  బ్యానర్ పై అందించి టాలీవుడ్ ఎప్పటికీ మర్చిపోలేని ఆరుదైన చిత్రరాజాలను ప్రేక్షక లోకానికి కానుకగా ఇచ్చారు. వయసు మీద పడి రాజకీయ ఒత్తిడిలో ఉన్నప్పటికీ సామ్రాట్ అశోక, బ్రహ్మర్షి విశ్వామిత్రలు తీయడం ఆయనలో తపనకు నిదర్శనం

రాజకీయం

తెలుగుదేశం పార్టీపెట్టిన తొమ్మిది నెలలకే అధికారంలోకి తీసుకురావడమే కాక  ప్రజాభీష్టం మేరకు వారి సంక్షేమానికి కావాల్సిన ఎన్నో పధకాలు సంస్కరణలు తీసుకొచ్చి ఉమ్మడి రాష్ట్రపు రాజకీయ ముఖచిత్రంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చారు. కాంగ్రెస్ లాంటి జాతీయ పార్టీలను ఢీ కొడుతూ ఢక్కామొక్కీలు తింటున్నా ఏ మాత్రం నెరవకుండా తిరిగి అధికారం చేజిక్కించుకోవడం ఎన్టీఆర్ ప్రజాబలానికి సజీవ సాక్ష్యం. వ్యక్తిగత జీవితంతో పాటు పొలిటికల్ గా ఎదురుకున్న ఆటుపోట్లకు బాధ్యతగా ఎత్తుపల్లాలు చూడాల్సి వచ్చిన ఎన్టీఆర్ చివరిశ్వాస వరకు సినిమా ప్రజలు రెండుకళ్ళుగా బ్రతికారు. మేజర్ చంద్రకాంత్ వరకు ఆ జైత్రయాత్ర కొనసాగింది

అభిమాన సందోహం

ఏడుకొండల వాడి దర్శనం కోసం తిరుపతి వెళ్లినవాళ్ళందరూ మదరాసు వెళ్లి ఎన్టీఆర్ ను చూసి రావడం అప్పట్లో రివాజుగా ఉండేది. ఇంటి దగ్గరకు తండోపతండాలుగా వచ్చిన వారిని స్వయంగా కలుసుకుని మంచి చెడ్డా అడిగి క్షేమంగా వెళ్లిరమ్మని ఆశీర్వదించి పంపేవారు. ఆ అభిమాన జనమే ఈ రోజుకీ టిడిపికి అండగా బలంగా నిలుస్తోంది. బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ల రూపంలో ఘనమైన వారసత్వాన్ని కొనసాగించేలా చేస్తోంది. కాలం చేసి పాతికేళ్ళు అవుతున్నా ఎన్టీఆర్ ముద్ర జనంలో ఎంత బలంగా ఉందో చెప్పడానికి శతజయంతి ఉత్సవాల వేళ సోషల్ మీడియాలో వస్తున్న స్పందన, మహానాడుకు దక్కుతున్న ఆదరణే సాక్ష్యం

వన్నెతెచ్చిన పురస్కారాలు

ఎన్టీఆర్ కు మూడుసార్లు జాతీయ పురస్కారం దక్కింది. తోడు దొంగలు, సీతారామకళ్యాణంలో నిర్మాణ భాగస్వామిగా, వరకట్నంలో దర్శకత్వానికి అందుకున్నారు. మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నెరవేర్చారు. 1968లో పద్మశ్రీ, 1978లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్, 1974లో కథారచయితగా తాతమ్మ కలకు నంది అవార్డు తీసుకున్నారు. 1972లో బండిపంతులుకు ఫిలిం ఫేర్ దక్కింది. ఇవన్నీ కొలమానాలు కాకపోయినా ఎన్టీఆర్ కీర్తికిరీటంలో కొన్ని వజ్రపుతునకలు. శతజయంతులు ఎన్ని వచ్చినా ఇంకో సహస్ర సంవత్సరాల తరువాత కూడా ఎన్టీఆర్ పేరు తెలుగునాట నిత్యం వినిపిస్తూనే ఉంటుంది