ఎన్నిక‌ల కోసం వైసీపీ స్టార్ క్యాంపెయినర్లు వీళ్లే…!

వ‌చ్చే ఎన్నిక‌లు కీల‌కంగా మార‌డం.. పెద్ద ఎత్తున పోటీ ఉంటుంద‌ని లెక్క‌లు రావ‌డంతో అధికార పార్టీ వైసీపీ అలెర్ట్ అవుతోంది. సామ‌దాన భేద దండోపాయాల‌తో అయినా..వ‌చ్చే ఎన్నిక‌ల్లోవిజ‌యం ద‌క్కించుకునేం దుకు ఇప్ప‌టికే స‌ర్వం సిద్ధం చేసుకున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే.. ఇప్పుడు ఎన్నిక‌ల వ్యూహాలు మారుతున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీని ఏకాకిని చేసి.. మిగిలిన పార్టీలు జ‌త‌క‌ట్టే అవ‌కాశం ఉన్న నేప‌థ్యంలో వైసీపీ ప్లాన్ మార్చింది.

ప్ర‌స్తుతం ఈ విష‌యంపై తాడేప‌ల్లి వ‌ర్గాలు భారీగానే క‌స‌రత్తు చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. దీని ప్ర‌కారం.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ నుంచి టికెట్లు పొందే నాయ‌కులు.. కొంద‌రు.. స‌మీప నియోజ‌క‌వ‌ర్గాల బాధ్య‌త‌ల ను కూడా నెత్తిన వేసుకోవాలని ప్లాన్ చేస్తున్న‌ట్టు స‌మాచారం. అదే స‌మ‌యంలో స్టార్ క్యాంపెయిన‌ర్లుగా కొంద‌రిని ఎంపిక చేస్తున్న‌ట్టు స‌మాచారం. మాస్ ఇమేజ్ స‌హా వాగ్దాటి ఉన్న నాయ‌కుడు..టీడీపీపై విరుచుకుప‌డేవారు కీల‌కంగా మార‌నున్నారు.

ఉదాహ‌ర‌ణ‌కు గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, మ‌చిలీప‌ట్నం ఎమ్మెల్యే పేర్ని నాని, న‌గ‌రి ఎమ్మెల్యే రోజా, మంత్రి గుడివాడ అమ‌ర్నాథ్ వంటివారిని తీసుకుంటే.. వీరిలో నాని, రోజా ఇద్ద‌రూ కూడా ఫైర్ బ్రాండ్స్ పైగా.. రాష్ట్ర వ్యాప్తంగా వారికి మంచి ఫాలోయింగ్ ఉంది. మాస్ నుంచి క్లాస్ వ‌ర‌కు కూడా.. వీరు ఆక‌ట్టుకునే అవ‌కాశం ఉంది. దీంతో ఇలాంటి వారిని ఎంపిక చేసి స్టార్ క్యాంపెయిన‌ర్లుగా ఎంపిక చేయాల‌ని వైసీపీ నిర్ణ‌యించే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.

వీరు మాత్ర‌మే కాదు.. ఫైర్ ఉన్న నాయ‌కుల‌ను ఎంపిక చేయాల‌ని క‌నీసం 10 -15 మందితో స్టార్ క్యాంపె యిన్ టీంల‌ను ఏర్పాటు చేయాల‌ని చూస్తున్నారు. వీరంతా.. త‌మ త‌మ‌ని యోజ‌క‌వ‌ర్గాల‌తో పాటు.. రాష్ట్ర వ్యాప్తంగా ప‌ర్య‌టించి పార్టీని గెలిపించాలి. అదేవిధంగా పేర్ని నాని, గుడివాడ అమ‌ర్నాథ్‌వంటి వారు.. ఆయా సామాజిక వ‌ర్గాలు.. జిల్లాల‌కు ప‌రిమితం చేసి.. బాధ్య‌త‌లు అప్ప‌గించే యోచ‌న చేస్తున్నారు.

అంటే.. ఒక‌వైపు.. టికెట్లు పొందిన వారితో పాటు..వీరు కూడా ప్ర‌చారం ముమ్మ‌రం చేయ‌నున్నారు. అదేస‌మ‌యంలో గ‌తంలో ప‌ద‌వులు పొందిన వారు.. ప్ర‌స్తుతం ప‌ద‌వుల్లో ఉన‌న్న‌వారు కేవ‌లంవారి నియోజ‌క‌వ‌ర్గాల‌కే ప‌రిమితం కాకుండా.. రాష్ట్ర వ్యాప్తంగా 3-5 నియోజ‌క‌వ‌ర్గాల బాధ్య‌త‌లు తీసుకునేలా ప్లాన్ చేస్తున్నారు. మొత్తంగా చూస్తే.. వైసీపీ పెద్ద ఎత్తున క‌స‌ర‌త్తు చేస్తుండ‌డం గ‌మ‌నార్హం.