మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్యకేసులో సంచలన ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు చేసే అంశంపై తెలంగాణ హైకోర్టులో వాదనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. విచారణ సందర్భంగా అవినాశ్ తరఫు న్యాయవాది తన వాదనలు వినిపించే వేళలో.. చివర్లో అవినాశ్ తల్లి శ్రీలక్ష్మి ప్రస్తావనను తీసుకొచ్చారు. సీనియర్ న్యాయవాది ఉమామహేశ్వర్ రావు తన వాదననలు వినిపిస్తూ.. పిటిషనర్ తల్లి శ్రీలక్ష్మీ హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రిలో సర్జరీ జరుగుతోందని చెప్పారు.
తండ్రి జైల్లో ఉన్నారు. ఆయన ఆరోగ్యం కూడా బాగోలేదు. ఈ పరిస్థితుల్లో పిటిషనర్ తప్ప శ్రీలక్ష్మిని చూసుకోవటానికి ఎవరూ లేరు. అరెస్టు నుంచి అవినాశ్ కు రక్షణ కల్పించాలి.. అని పేర్కొన్నారు. సంచలనంగా మారిన రహస్య సాక్షి స్టేట్ మెంట్ మీదా అవినాశ్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ‘రహస్య సాక్షి స్టేట్ మెంట్ ను కోర్టు రికార్డుల్లో చేర్చకుండా.. ఎదుటివారికి అందజేయకుండా ఆ సాక్ష్యంపై కోర్టు ఆధారాపడాలని ఎలా కోరుకుంటారు?’’ అని ప్రశ్నించారు.
ఈ సందర్భంగా స్పందించిన హైకోర్టు ఏక సభ్య ధర్మాసనం.. ‘‘తన తల్లిని కర్నూలు నుంచి గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించామని.. గుండె రక్తనాళాల్లో బ్లాక్స్ వల్ల అత్యవసర చికిత్స జరుగుతోందని పిటిషనర్ పేర్కొంటున్నారు. పిటిషనర్ చేస్తున్న వాదనకు ఎలాంటి మెడికల్ రికార్డులు.. ఆధారాలు లేవని సీబీఐ లాయర్లు వ్యతిరేకిస్తున్నారు. సర్జరీ జరుగుతోందన్న పిటిషనర్ న్యాయవాది స్టేట్ మెంట్ రికార్డు చేస్తున్నాం. ఒకవేళ సర్జరీ అంశం తప్పని తేలితే కఠిన చర్యలు తీసుకుంటాం’’ అని పేర్కొన్నారు. తుది తీర్పును మే 31న (బుధవారం) వెల్లడిస్తామని కేసు విచారణను వాయిదా వేసింది. కోర్టు తుది నిర్ణయం ఎలా ఉంటుందన్నది ఇప్పుడు ఉత్కంటగా మారింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates