రెండు రోజుల కిందట వైసీపీ అధినేత, సీఎం జగన్ అమరావతిలోని ఆర్ – 5 జోన్‌లో పేదలకు పట్టాలు పంచారు. దాదాపు 1,486 ఎకరాల్లో నిర్మించిన 25 లే అవుట్లలో ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లోని లబ్ధిదారులైన పేదలకు సీఎం జగన్ స్వయంగా పట్టాలు అందించారు. అయితే..దీనిపై కోర్టు గతంలోనే ఆంక్షలు విధించింది. అమరావతి రాజధాని విషయంలో కోర్టులు ఇచ్చే తుది తీర్పునకు లోబడి ఈ పట్టాలు చెల్లుబాటు అవుతాయని తెలిపింది. మరోవైపు.. అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులు.. ఇలా తాము రాజధాని భూములు ఇస్తే.. పట్టాలు పంచేయడం ఏంటని ఆందోళనలు చేపట్టారు.
అయినప్పటికీ.. సీఎం జగన్ అనుకున్నది చేశారు. పేదలకు ఎన్నికల సమయంలో తాము ఇచ్చిన హామీలమేరకు ఈ పట్టాలు పంచుతున్నామని చెప్పారు. అంతేకాదు.. పట్టాల పంపిణీ సమయంలో ఆయన ప్రసంగిస్తూ.. ప్రతి పేద కుటుంబానికి రూ.10 లక్షల స్థిరాస్తిని తాము ఇస్తున్నామని.. ఇది పట్టాకాదు.. పేదల ఆత్మగౌరవమని. గతంలో చంద్రబాబు ఎవరికైనా సెంటు భూమి ఇచ్చారా? అని ఆయన ప్రశ్నించారు. ఇక్కడ కట్ చేస్తే.. సీఎం జగన్ వ్యాఖ్యలపై మేధావులు తమ మెదళ్లకు పదునుపెట్టారు. గతంలో ఈ భూములకు ఉన్న విలువ ఎంత? ఇప్పుడు సీఎం జగన్ రూ.10 లక్షలు అని చెబుతున్న దానికి అంత రేటు ఎందు కు.. ఎలా వచ్చింది? అనే ప్రశ్నలను తెరమీదికి తెచ్చారు.
వాస్తవానికి అమరావతి రాజధాని అనే పేరును కనుక పక్కన పెడితే.. ఇప్పుడు జగన్ ఇచ్చిన భూములు ఎక్కడున్నాయంటే.. పిచ్చుకలలంక, నవులూరు, రాపూరు.. తదితర చిన్న చిన్న గ్రామాల్లో ఉన్నాయి. గతంలో ఈ భూములకు ఉన్న విలువ శూన్యం. కానీ, టీడీపీ అధినేతగా చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత.. అమరావతిని ప్రకటించిన తర్వాత.. ఇక్కడ అనేక సంస్థలు, కార్యాలయాలు.. సచివాలయం, హైకోర్టు వంటివి వచ్చిన తర్వాత.. ఇక్కడి భూములకు ధరలు పెరిగాయి. ఇప్పుడు సెంటు ప్రభుత్వం చెబుతున్నట్టు రూ.8.50 లక్షలకు చేరింది.
మిగిలిన నిర్మాణ ఖర్చుతో కలుపుకొంటే పది లక్షలకు చేరింది. అంటే.. ఒకరకంగా.. ఇక్కడ పేదలకు అందుతున్నరూ.10 లక్షల రూపాయల సెంటు భూమి వెనుక కూడా చంద్రబాబు కష్టం.. ఆయన దూరదృష్టి ఉన్నాయనేకదా! అంటున్నారు మేధావులు. పైగా.. భవిష్యత్తులో ఇవి మరిన్ని లక్షలకు చేరుకుంటాయని కూడా సీఎం జగన్ చెబుతున్నారు. దీనిని కూడా ప్రస్తావిస్తూ.. చంద్రబాబు అధికారంలోకి వస్తే తప్ప.. ఇక్కడ ధరలకు రెక్కలు రావని.. ఎందుకంటే.. అమరావతిని జగన్ వదిలేశారు కాబట్టి.. ఇక్కడ ధరలు పెరిగే అవకాశం లేదని.. సెంటు భూమి రూ.25 లక్షలకు చేరాలంటే.. ఖచ్చితంగా చంద్రబాబు వస్తేనే అమరావతిని పట్టాలెక్కిస్తేనే సాధ్యమవుతుందని అంటున్నారు. మొత్తంగా.. జగన్ పట్టాలిచ్చి.. తన పేరును ప్రచారం చేసుకుంటున్నా.. దండలో దారం మాదిరిగా చంద్రబాబు కృషిని మేధావులు గుర్తు చేస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates