టీడీపీ ఏపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాడు.. మహానాడులో హైలెట్ ప్రసంగం చేశారు. ప్రతి మాటలో నూ తూటా పేల్చారు. రెచ్చిపోయి ప్రసంగించారు. వచ్చే ఎన్నికల్లో 160 స్థానాలను టీడీపీ గెలుచుకోవడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా.. టీడీపీది ఎప్పుడూ ప్రజాపక్షమే అన్నారు. 2019లో ఓ దోపిడీ దొంగకు ప్రజలు ఓట్లేసి తప్పు చేశారన్నారు. సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని సమానంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేశామని గుర్తుచేశారు.
కాకపోతే చేసిన పనులను చెప్పుకోలేకపోయామని అచ్చెన్నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. అప్పట్లో తెలుగుదేశాన్ని ఎదుర్కోలేకే.. జగన్ కోడి కత్తి డ్రామా.. సొంత బాబాయ్‌ని చంపి ప్రజల సానుభూతితో ముఖ్యమంత్రి అయ్యారని తెలిపారు. జగన్‌ను వేటాడి.. వెంటాడి తరిమి కొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని వ్యాఖ్యానించారు. 151 స్థానాలు రావడంతో జగన్ కళ్లు నెత్తికెక్కి ఒళ్లు మదమెక్కిందని మండిపడ్డారు.
‘‘ఏపీలోని ఐదు కోట్ల మంది ప్రజలు జగన్‌ను ఛీకొడుతున్నారు. ఈ మధ్య సీఎం జగన్ నంగనాచి మాటలు మాట్లాడుతున్నారు. జగనేమో పేద వాడంట.. చంద్రబాబేమో ధనవంతుడట. జగన్ అబద్ధాల కోరు. 28 రాష్ట్రాల సీఎంలకు రూ. 508 కోట్లు ఉంటే.. జగన్ ఒక్కడికే అంత ఆస్తి ఉంటుంది. 30 కేజీలున్న జగన్‌కు ఏడు బంగళాలు కావాలంట. బెంగళూరు, ఇడుపులపాయ, లోటస్ పాండ్, అమరావతిలో ప్యాలెస్ ఎవరిది..? ఇప్పుడేమో ఉత్తరాంధ్రను ఉద్ధరిస్తానంటూ విశాఖలో రాజధాని పెట్టి అక్కడో ఇల్లు కడతాడంట“ అని అచ్చెన్న నిప్పులు చెరిగారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉత్తరాంధ్రలోనే కాదు.. పులివెందులలో కూడా కర్రు కాల్చి వాత పెట్టారని వైసీపీపై అచ్చెన్న విమర్శలు గుప్పించారు. చంద్రబాబు కట్టిన టిడ్కో ఇళ్లను పక్కన పెట్టేసి సెంటు పట్టా ఇచ్చారని, నాలాగా పొడవుగా ఉండే వాడికి సెంటు పట్టా సరిపోతుందా..? అని ప్రశ్నించారు. గతంలో ఇంటి ఖర్చు ఎంతైంది..? ఇప్పుడు ఎంతైందో ఆలోచించండని ప్రజలకు పిలుపునిచ్చారు. వివేకా హత్య విషయంలో మేం చెప్పిందే సీబీఐ చెప్పిందని వ్యాఖ్యానించారు.
రూ. 2 వేల నోటు రద్దుతో తన దగ్గరున్న నోట్లను ఏం చేయాలో తెలియక జగన్ తల పట్టుకున్నారని అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు. “లోకేష్ పాదయాత్ర అద్భుతంగా జరుగుతోంది. ఓ ఆశయం గురించి 48 డిగ్రీల ఎండలో లోకేష్ పాదయాత్ర దిగ్విజయంగా సాగుతోంది. మహానాడుకు ప్రభుత్వం బస్సులు ఇవ్వకుండా రాకుండా చేశారు. మహానాడు కోసం అలంకరణ చేస్తే.. జగన్ బ్లేడ్ బ్యాచ్.. ఫ్లెక్సీలను బ్లేడ్లతో కోసేశారు.” అంటూ అచ్చెన్నాయుడు నిప్పులు చెరిగారు.