తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడు, యుగపురుషుడు నందమూరి తారక రామారావు శతజయంతి వేడుకలను చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహించేందుకు టీడీపీ ఏర్పాట్లు చేసింది. ఈ నెల 27, 28న వేడుకలు జరగనుండగా.. రాజమహేంద్రవరానికి ముందుగానే మహానాడు కళ వచ్చేసింది. ఎన్నికల ఏడాది కావటంతో.. ఈసారి పసుపు పండుగను విజయవంతం చేసేందుకు తెలుగుదేశం ఉవ్విళ్లూరుతోంది. నాలుగేళ్ల వైసీపీ పాలన పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని భావిస్తున్న తెలుగుదేశం.. మహానాడు వేదికను తమకు అనుకూలంగా మలచుకోనుంది.
ప్రజాక్షేత్రంలో ప్రభుత్వ విధానాలను ఎండగట్టాలని నిర్ణయించింది. మహానాడు నిర్వహణ పట్లా ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోన్నందున ప్రజా క్షేత్రంలో సత్తా చాటేందుకు సవాలుగా తీసుకుని నిర్వహిస్తోంది. సన్నాహక కార్యక్రమంలో భాగంగా పార్టీ అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ఇవాళే రాజమహేంద్రవరం చేరుకోనున్నారు. సాయంత్రం జరిగే పొలిట్ బ్యూరో సమావేశంలో మహానాడు అజెండా తో పాటు పార్టీ పరంగా అనుసరించే రాజకీయ విధానాలను ఖరారు చేయనున్నారు.
ఎన్నో చారిత్రక ఘట్టాలకు వేదికగా నిలిచిన రాజమహేంద్రవరం నుంచే సార్వత్రిక ఎన్నికల శంఖం పూరించనున్నారు. సుమారు 200 ఎకరాల విస్తీర్ణంలో వేడుక జరగనుంది. 27న ప్రతినిధుల సభ, 28న మహనాడు బహిరంగభ నిర్వహించనున్నారు. పార్కింగ్, భోజన స్టాళ్లకు సుమారు 140 ఎకరాల మేర కేటాయించారు. ప్లీనరీ ప్రాంతంలో ప్రధాన వేదిక నిర్మిస్తున్నారు. అందులో ప్రధాన సభతోపాటు 15 వేల మంది కూర్చొనేలా 9 గ్యాలరీలు ఏర్పాటు చేశారు.
లోకేశ్ యువగళం పాదయాత్రకు సంబంధించిన ఫొటోలు కూడా ఎగ్జిబిషన్లో ప్రత్యేక ఆకర్షణ కానుంది. అదే ప్రాంగణంలో రక్తదానం శిబిరం, సభ్యత్వ నమోదు, విరాళాల సేకరణకు ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి. వీఐపీలు, ప్రతినిధులకు రాజమహేంద్రవరం రుచులు చూపించేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. మహానాడులో 19 తీర్మానాలు చేయనున్నట్లు నేతలు తెలిపారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates