ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న నూతన పార్లమెంట్ భవనం(సెంట్రల్ విస్టా) ప్రారంభంపై చెలరేగిన రగడ సుప్రీం కోర్టుకు చేరింది. పార్లమెంట్ భవనాన్ని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రారంభించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దేశ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలైంది. లోక్సభ సెక్రటేరియట్.. నూతన భవన ప్రారంభోత్సవానికి రాష్ట్రపతిని ఆహ్వానించకుండా రాజ్యాంగాన్ని ఉల్లంఘించిందని న్యాయవాది జయ సుకిన్ పిల్ దాఖలు చేశారు.
అయితే, ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం ఈ పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించనున్న నేపథ్యంలో ఒక్క రోజు ముందు ఇలా ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరడం.. ఈ ఒక్కరోజులో సుప్రీంకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందోననే ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో కొనసాగుతోంది. మోడీ కాకుండా రాష్ట్రపతితో పార్లమెం ట్ భవనాన్ని ప్రారంభించేలా చూడాలని పిల్లో పిటిషనర్ కోరారు.
ప్రధాన మంత్రిని రాష్ట్రపతి నియమిస్తారు. అలాగే కేంద్ర కేబినెట్ను ప్రధాన మంత్రి సలహా మేరకు రాష్ట్రపతి నియమిస్తారు. గవర్నర్లు, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు వంటి రాజ్యాంగపరమైన అధికారులను నియమించడానికి భారత రాష్ట్రపతికి అధికారం ఉంది. యూపీఎస్సీ, ప్రధాన ఎన్నికల కమిషనర్ లాంటి అధికారులను రాష్ట్రపతే నియమిస్తారు. అలాంటప్పుడు పార్లమెంట్ను రాష్ట్రపతి ప్రారంభించాలి అని పిల్లో న్యాయవాది జయ సుకిన్ పేర్కొన్నారు.
ఇదిలావుంటే, నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనుండడంపై కాంగ్రెస్ మాటల దాడిని తీవ్రం చేసింది. మోడీ ప్రభుత్వ అహంకారం పార్లమెంటరీ వ్యవస్థను నాశనం చేసిందని మండిపడింది. ఒక వ్యక్తి అహం, స్వీయ ప్రచార దాహం .. దేశ గిరిజన మహిళా రాష్ట్రపతి హక్కును హరిస్తోందని విమర్శించింది. అదేవిధంగా 19 ప్రతిపక్ష పార్టీలు ఈ కార్యక్రమానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాయి.