బీజేపీకి ఇంత కడుపుమంటగా ఉందా ?

కర్ణాటక ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన బీజేపీకి ఘన విజయం సాధించిన కాంగ్రెస్ అంటే బాగా మంటగా ఉన్నట్లుంది. ఈ విషయం బీజేపీ నేతలు చేసిన ట్వీట్లోనే బయటపడుతోంది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేస్తూ బీజేపీ తన ట్విట్టర్ ఖాతాలో ఒక పోస్టు పెట్టింది. అందులో ఏముందంటే ప్రజలకు తప్పుడు హామీలను ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ఉంది. ప్రజలకు ఇచ్చిన ఐదు గ్యారెంటీ స్కీములను వెంటనే అమల్లోకి తీసుకురావాలని డిమాండ్ చేసింది.

కాంగ్రెస్ గనుక ఐదు గ్యారెంటీ పథకాలను అమల్లోకి తీసుకురాకపోతే జనాలు తిరగబడతారంటు హెచ్చరించింది. తాజా ట్వీట్ తోనే కాంగ్రెస్ అంటే బీజేపీ నేతల్లో ఎంతటి కడుపుమంటుందో బయటపడింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి వారంరోజులు కూడా కాలేదు. ప్రభుత్వ ఆర్ధిక పరిస్ధితి ఏమిటో ముందు తెలుసుకోవాలి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇపుడు అదే పనిలో ఉన్నారు. పైగా ఐదు గ్యారెంటీ స్కీములను వెంటనే అమల్లోకి తెస్తామని ప్రమాణస్వీకారోత్సవం సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ప్రామిస్ కూడా చేశారు.

కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారం, మంత్రిపదవుల కోసం ఢిల్లీచుట్టూ తిరుగుతున్నట్లు మాజీ సీఎం బసవరాజ్ బొమ్మై ఎద్దేవా చేయటమే విచిత్రంగా ఉంది. తన పదవీకాలంలో బొమ్మై ఢిల్లీకి 32 సార్లు వెళ్ళారు. మంత్రులుగా ఎవరిని తీసుకోవాలనే విషయాన్ని ఢిల్లీ పెద్దలతోనే చర్చించి ఫైనల్ చేశారు. మంత్రివర్గం ఫైనల్ కావటానికే చాలారోజులు పట్టింది. తాను సీఎంగా ఉన్నపుడు రెగ్యులర్ గా ఢిల్లీచుట్టూ తిరిగిన బొమ్మై కూడా ఇపుడు కాంగ్రెస్ ను విమర్శిస్తుండటమే ఆశ్చర్యంగా ఉంది.

సరే కాంగ్రెస్ నేతలేమీ ఊరుకో కూర్చోలేదు. బీజేపీ ట్వీట్లకు ధీటుగానే సమాధానమిచ్చారు. ఎన్నికల్లో ఓడిపోయిన బీజేపీ నేతలు మానసిక వేధనతో కుమిలిపోతున్నట్లు ఎద్దేవాచేశారు. ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకుని ఇళ్ళల్లో ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఐదుగ్యారెంటీ పథకాలను తమ ప్రభుత్వం కచ్చితంగా అమలుచేసి తీరుతుందని గట్టిగానే చెప్పారు. తమిచ్చిన హామీలను అమలు చేసే విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానాలు అవసరంలేదని కూడా సిద్ధరామయ్య స్పష్టంగా ప్రకటించారు.