ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడవని అంటారు. అలాగే.. పరస్పర విరుద్ధమైన పార్టీల నేతల అభిప్రాయాలు .. లక్ష్యాలు కూడా కలవవు. ముఖ్యంగా ఏపీ వంటిరాష్ట్రంలో అధికార పార్టీ వైసీపీ ఒకటంటే.. ప్రతిపక్షం టీడీపీ మరొకటి అంటుంది. అలాంటి రెండు పార్టీలు కూడా ఒక విషయంలో కలిసిపోయాయి. ఇరు పార్టీలు కూడా ప్రధాని మోడీ విషయానికి వచ్చేసరికి రెండు పార్టీలు కూడా.. జై కొట్టాయి.
అదే.. కొత్త పార్లమెంటు భవనం ప్రారంభోత్సవానికి సంబంధించి అటు వైసీపీ అధినేత, సీఎం జగన్.. ప్రధాని మోడీకి జై కొట్టిన మరుసటి రోజే టీడీపీ అధినేత కూడా జేజేలు పలికారు. దీంతో ఇరు పార్టీల వ్యవహారం..చర్చనీయాంశంగా మారింది. పార్లమెంట్ కొత్త భవనం ప్రారంభోత్సవంపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తాజాగా ట్వీట్ చేశారు.
కొత్త పార్లమెంట్ భవన నిర్మాణం చరిత్రాత్మకమైందని, చారిత్రాత్మక కట్టడాన్ని నిర్మించడంలో దోహదపడిన ప్రధాని మోడీకి, కేంద్రానికి అభినందనలు తెలుపుతున్నట్లు చంద్రబాబు ట్విట్టర్‌లో పేర్కొన్నారు. చట్టాల రూపకల్పనకు పార్లమెంటు భవనం వేదిక కావాలని, 2047 నాటికి స్వాతంత్య్రం వచ్చి 100 ఏళ్లు పూర్తయ్యే నాటికి పేదలు లేని దేశం కోసం కొత్త పార్లమెంట్ భవనం దిక్సూచి కావాలని చంద్రబాబు అన్నారు.
కేంద్ర ప్రబుత్వ ఆహ్వానం మేరకు తమ పార్టీ ఎంపీలను కార్యక్రమానికిపంపిస్తున్నట్టు తెలిపారు. అయితే.. పార్లమెంటు భవనం ప్రారంభోత్సవం నాడు.. తమ పార్టీ(టీడీపీ) వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ జయంతి ఉన్నందున తాను రాలేక పోతున్నానని కేంద్రానికి పంపిన లేఖలో చంద్రబాబు స్పష్టం చేశారు.