రారండో రండో రండి.. త‌మ్ముళ్ల‌కు చంద్ర‌బాబు లేఖ‌

స‌మ‌స‌మాజ స్థాప‌న కోసం మ‌హాక‌వి శ్రీశ్రీ రారండో రండో రండి అని పిలుపునిచ్చిన‌ట్టు టీడీపీ అధినేత చంద్ర‌బాబు కూడా పార్టీ నాయ‌కుల‌కు, శ్రేణుల‌కు పిలుపునిచ్చారు. ఎన్నికలకు సరిగ్గా ఏడాది ముందు కదనోత్సాహంతో ‘మహానాడు 2023’కు తెలుగుదేశం పార్టీ సిద్ధమైంద‌ని.. తెలిపారు. రాజమహేంద్రవరం సమీపంలోని వేమగిరిలో ఈనెల 27, 28 తేదీల్లో తలపెట్టిన ఈ పసుపు శ్రేణుల పండగకు ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. మొదటి రోజున ప్రతినిధుల సభ, రెండో రోజున ఎన్టీఆర్ జయంతి, బహిరంగ సభ జరగనున్నాయి.

ఈ మేరకు ‘మహానాడు పార్టీ ప్రతినిధుల సభకు ఆహ్వానము’ పేరిట పార్టీ అధినేత చంద్రబాబు ఆహ్వానాలు పంపిస్తున్నారు. తన డిజిటల్ సైన్‌‌తో ఉన్న ఆహ్వాన పత్రికలతో పార్టీ కేడర్‌ను ఆహ్వానిస్తున్నారు. ఈ మేర‌కు చంద్ర‌బాబు పార్టీ శ్రేణులకు లేఖ‌లు రాశారు. “తెలుగుజాతి ఔన్నత్యాన్ని, ఆత్మగౌరవాన్ని యావత్ ప్రపంచానికి చాటిచెప్పిన మన ప్రియతమ నాయకులు, రాష్ట్ర, దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పునకు నాంది పలికిన యుగపురుషుడు స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి శతజయంతి ఉత్సవాలను మహానాడు వేదికగా మరింత ఘనంగా జరుపుకుంటుంది తెలుగుదేశం” అని పేర్కొన్నారు.

“అలానే అన్నగారి జయంతి సందర్భంగా ప్రతి ఏటా పార్టీ ప్రతినిధుల మహానాడును మే 27న జరుపుకోవడం మన సంప్రదాయం. రాజమహేంద్రవరం (వేమగిరి)లో నిర్వహిస్తున్న మహానాడులో రాజకీయ, సాంఘీక, ఆర్థిక, ఆరోగ్య, సంస్థాగత అంశాలపై మరియు ప్రభుత్వ ప్రజావ్యతిరేక నిర్ణయాలు, అప్రజాస్వామిక విధానాలపై చర్చ జరుగుతుంది. మే 28న భారీ బహిరంగ సభకు జరుగుతుంది. ఈ మహానాడులో మీరందరూ భాగస్వాములు కావాలని సాదరంగా ఆహ్వానిస్తున్నాను… అభినందనలతో మీ నారా చంద్రబాబు నాయుడు” అని లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు.