ప్రెస్ మీట్లో చిరు ద‌గ్గారు.. ఆ త‌ర్వాత‌

లాక్ డౌన్ వేళ అనేక మంచి ప‌నులు చేశారు మెగాస్టార్ చిరంజీవి. సినీ కార్మికుల‌ను ఆదుకునే కార్య‌క్రమాలు చేప‌ట్ట‌డంతో పాటు క‌రోనా మీద అవ‌గాహ‌న క‌ల్పించేలా అనేక కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు. ఇప్పుడు ఆయ‌న మ‌రో మంచి ప‌నికి శ్రీకారం చుట్టారు. కోవిడ్ చికిత్స‌లో అత్యంత కీల‌కంగా మారిన ప్లాస్మా దానంపై జ‌నాల్లో అవ‌గాహ‌న పెంచే ప‌నిలో ప‌డ్డారు. ఇప్ప‌టికే ఈ విష‌య‌మై వీడియోల ద్వారా జ‌నాల్ని జాగృతం చేసే ప్ర‌య‌త్నం చేశారు. తాజాగా ఆయ‌న హైద‌రాబాద్‌లో ప్లాస్మా దాత‌ల్ని స‌న్మానించారు. సైద‌రాబాద్ పోలీస్ క‌మిష‌న‌ర్ స‌జ్జ‌నార్‌తో క‌లిసి ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

కరోనా‌ను జయించి కోవిడ్ పేషంట్లకు ప్లాస్మా దానం చేసిన 150 మందిని చిరంజీవి, సజ్జనార్ క‌లిసి స‌న్మానించ‌డంతో పాటు ప్రెస్ మీట్ నిర్వ‌హించి.. ప్లాస్మా దానంపై అవ‌గాహ‌న క‌ల్పించే ప్ర‌య‌త్నం చేశారు. ఈ సంద‌ర్భంగా చిరంజీవి మాట్లాడుతూ మాట్లాడుతూ.. మ‌ధ్య‌లో ద‌గ్గారు. దీంతో స‌మావేశంలో చిన్న అల‌జ‌డి రేగింది. చిరంజీవి వెంట‌నే త‌మాయించుకుని.. తాను ద‌గ్గుతున్నాన‌ని కంగారు ప‌డాల్సిన ప‌ని లేద‌ని.. తాను బాగానే ఉన్నాన‌ని అన్నారు.

ఈ రోజుల్లో మామూలుగా ద‌గ్గు వ‌చ్చి ద‌గ్గడానికి కూడా భ‌య‌ప‌డాల్సి వ‌స్తోంద‌ని చిరు అన‌డంతో అంద‌రూ న‌వ్వారు. ప్లాస్మా.. కరోనా సోకిన వారికి సంజీవినిలా పనిచేస్తోందన్న చిరు.. కరోనాను జయించిన వారిలో మూడు నెలల పాటు యాంటీ బాడీస్ ఉంటాయని.. ప్లాస్మాలోని యాంటీ బాడీస్ 24 గంటల నుంచి 48 గంటల్లోపు తిరిగి వస్తాయని.. కరోనా జయించిన ఒక్కో వ్యక్తి 30 సార్లు ప్లాస్మా డొనేట్ చేయవచ్చని చెప్పారు.