ప్రపంచానికి మోడీ హగ్ థెరపీ

ఇద్దరు ప్రముఖులు కలిస్తే ఏం చేస్తారు? మర్యాదపూర్వకంగా షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు. అలా చేస్తే ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేకత ఏముంటుంది? భారతీయుల మార్క్ గా చెప్పే నమస్కారం.. అనుబంధానికి.. అప్యాయతకు గుర్తుగా ఆత్మీయ ఆలింగనం చేసుకోవటం తెలిసిందే. ఈ విధానాన్ని పాటించటం ద్వారా.. మిగిలిన వారికి భిన్నమైన రీతిలో నిలిచారు మోడీ. 2014లో ప్రధానమంత్రిగా ఎన్నికైన తర్వాత ఆయన పెద్ద ఎత్తున విదేశీ పర్యటనలు చేశారు.

అప్పటివరకు రెండు.. మూడు దశాబ్దాల పాటు భారత ప్రధానులు ఎవరూ పర్యటించని ఎన్నో దేశాల్లో మోడీ పర్యటించటం ద్వారా.. సరికొత్త రికార్డును క్రియేట్ చేశారు. ఒకదశలో దేశంలో కంటే విదేశాల్లోనే మోడీ ఎక్కువగా ఉంటున్నారన్న విమర్శ కూడా వినిపించింది. రెండో టర్మ్ తో పోలిస్తే.. మొదటి టర్మ్ లోనే మోడీ పెద్ద ఎత్తున విదేశీ పర్యటనలు చేశారు. దీనికి తోడు రెండో దఫా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కొంతకాలానికే కరోనా దెబ్బకు దాదాపు రెండేళ్ల పాటు పర్యటనలకు దూరంగా ఉండాల్సి రావటం తెలిసిందే. తాజాగా జపాన్ లోని హీరోషిమాలో నిర్వహించిన జీ7 శిఖరాగ్ర సదస్సుకు హాజరైన మోడీ.. తన ఆత్మీయ ఆలింగనాల మార్కుతో మనసుల్ని దోచేస్తున్నారు.

ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తొలిదశలో విదేశీ పర్యటనల సందర్భంగా అక్కడి దేశాధ్యక్షులకు.. దేశ ప్రధానులకు ఆత్మీయ ఆలింగనాలు కొత్తగా ఉండేవి. కొందరు ఎబ్బెట్టు చర్యగా పేర్కొన్నా.. మోడీ లైట్ తీసుకున్నారు. మిగిలిన దేశాధినేతలు ఫార్మల్ గా ఇచ్చే షేక్ హ్యాండ్ కంటే.. ఆత్మీయంగా దగ్గరగా హత్తుకునే మోడీ తీరు చాలామందిని ఆకర్షించింది. తొమ్మిదేళ్ల కాలంలో అది ఆయన తీరును చెప్పే సిగ్నేచర్ గా మారింది. విదేశీ పర్యటనలోనే కాదు.. భారతదేశానికి వచ్చే విదేశీ అతిధుల విషయంలోనూ మోడీ ఆత్మీయ ఆలింగనాలు ఇవ్వటం కనిపిస్తుంది.

ఆసక్తికరమైన విషయం ఏమంటే.. మోడీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఇప్పటివరకు ముగ్గురు అమెరికా అధ్యక్షులు మారారు. ఆయన ప్రధానిగా బాధ్యతలు చేపట్టే నాటికి బరాక్ ఒబామా అమెరికా అధ్యక్షుడిగా ఉండటం.. ఆయన్ను కలిసిన ప్రతి సందర్భంలోనూ ఆయనకు హగ్ ఇచ్చేవారు మోడీ. ఆ తర్వాత దేశాధ్యక్ష పదవిని చేపట్టిన ట్రంప్ తోమోడీ ఎంత సన్నిహితంగా ఉండేవారో తెలిసిందే. ఆయనతో పాటు.. ట్రంప్ కు బద్ధ వ్యతిరేకి అయిన తాజా అధ్యక్షుడు జోబైడెన్ కు సైతం మోడీ ఒకేలాంటి హగ్ ఇవ్వటం ద్వారా.. తనకు వ్యక్తుల కంటే కూడా వారు ప్రాతినిధ్యం వహించే పదవికి తానిచ్చే గౌరవంగా ఆయన తీరు ఉండేది.

దేశాధ్యక్షులు.. దేశాధినేతలకు మాత్రమే మోడీ హగ్ ఇస్తారంటే తప్పులో కాలేసినట్లే. వివిధ రంగాలకు చెందిన విదేశీ ప్రముఖులు పలువురికి ఆయన హగ్ చేసుకుంటారు. వీరిలో సెలబ్రిటీలు.. బిజినెస్ మ్యాన్లు కూడా ఉంటారన్నది మర్చిపోకూడదు. అయితే.. ఈ హగ్గులకు కొన్ని లెక్కలు ఉన్నాయన్న మాట వినిపిస్తూ ఉంటుంది. అందుకు నిదర్శనంగా జీ7 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా తాను కలిసిన ఉక్రెయిన్ దేశాధ్యక్షుడికి ఆత్మీయ ఆలింగనాన్ని ఇవ్వని మోడీ.. కేవలం కరచాలనం మాత్రమే ఇచ్చారు.

అదే సమయంలో ఉక్రెయిన్ కు శత్రువు అయిన రష్యా ప్రధాని పుతిన్ కు మాత్రం ఆత్మీయ హగ్ ఇవ్వటం కనిపిస్తుంది. తన ఆత్మీయ ఆలింగనాలతో అందరిమనసుల్ని దోచేస్తున్న మోడీ..ఇప్పుడు ప్రపంచానికి హగ్ థెరపీని నేర్పిస్తున్నారని చెప్పాలి. ఇక్కడ మరో విషయాన్ని ప్రస్తావించాలి. ఆ మధ్యలో వచ్చిన శంకర్ దాదా ఎంబీబీఎస్ మూవీలో.. ఆత్మీయ ఆలింగనం మనిసి మనసును తాకుతుందని.. దీంతో కొండంత ఊరటను కలిగిస్తుందని చెబుతూ.. హగ్గులు ఇచ్చే హీరో తీరును ఈ సినిమాలో చూశారంతా. ఈ సినిమాలో కథకుడు ఏం చెబుతారో.. సరిగ్గా దాన్నే ప్రధాని రేంద్ర మోడీ అమలు చేస్తూ.. అందరిని ఆకర్షిస్తున్నారని చెప్పక తప్పదు.