బీఆర్ఎస్ ను ‘బంధు’లే ముంచేస్తాయా ?

రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ ను బంధులే ముంచేస్తాయేమో అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. తొందరలోనే దళితబంధు పథకాన్ని అమలుచేయాలని కేసీయార్ ఈమధ్యనే ఉన్నతాధికారులకు ఆదేశాలిచ్చారు. ఆదేశాలిచ్చారు కానీ ఆచరణ ఎలాగో మాత్రం చెప్పలేదు. ఎందుకంటే దళితబంధు పథకం అమలుకు కనీసం రు. 20 వేల కోట్లు కావాలి. అంతడబ్బు ప్రభుత్వం దగ్గర లేదన్నది వాస్తవం. ఈ పథకాన్ని పక్కన పెట్టేస్తే బీసీ బంధు పథకం అమలుకు కూడా కేసీయార్ రెడీ అవుతున్నారు.

విచిత్రం ఏమిటంటే పథకాల అమలుకు తగినంత నిధులు ప్రభుత్వం దగ్గర లేకుండానే పథకాలను పక్కాగా అమలుచేసేయాలని కేసీయార్ ఆదేశాలిచ్చేస్తున్నారు. దళితబంధు పథకాన్ని అమలుచేసేందుకు 2022-23 ఆర్ధిక సంవత్సరంలోనే రెడీ అయ్యారు. అయితే ఒక్క లబ్దిదారుడికి కూడా పథకంలో డబ్బులు అందలేదు. కారణం ఏమిటంటే ప్రభుత్వం దగ్గర అవసరమైన రు. 17 వేల కోట్లు లేకపోవటమే. తర్వాత 2023-24 ఆర్ధిక సంవత్సరంలో కూడా దళితబంధుకు ప్రభుత్వం రు. 17500 కోట్లను కేటాయించినా ఇంతవరకు పథకం అమలుకాలేదు.

కారణం ఏమిటంటే సేమ్ డబ్బులు లేకపోవటమే. మరో ఆరు మాసాల్లో ఎన్నికలుండగా ఇలాంటి పథకాలను ప్రకటించటం ఎందుకు, అమలు విషయంలో గాలిమాటలు చెప్పటం ఎందుకు? నిజానికి హుజూరాబాద్ ఉపఎన్నికలోనే దళితబంధు పథకం ప్రకటించి కొంత హడావుడి చేశారు కేసీయార్. కొందరికి డబ్బులు ఇచ్చి, కొందరికి ఇవ్వక నానా గోలైంది. మొత్తానికి ఎవరూ బీఆర్ఎస్ కు ఓటేయకుండా బీజేపీ తరపున పోటీచేసిన ఈటల రాజేందర్ ను గెలిపించారు.

ఈటల గెలుపుతో మండిపోయిన కేసీయార్ తర్వాత పథకం అమలుపై పెద్దగా శ్రద్ధపెట్టలేదు. అయితే మళ్ళీ ఎన్నికలు వస్తున్న నేపధ్యంలోనే దళితబంధని, బీసీబంధని హడావుడి మొదలుపెట్టారు. దళితబంధుకే డబ్బులు లేకపోతే ఇక బీసీబంధు కూడా ఏ విధంగా అమలుచేయగలరు ? దళితబంధులో ప్రతి లబ్దిదారుడికి రు. 10 లక్షలయితే బీసీబంధులో లబ్దిదారుడికి లక్ష రూపాయలు. ఇక్కడే బీసీ సంఘాల నుండి నిరసన వ్యక్తమవుతోంది. దళితులకు రు. 10 లక్షలిచ్చి తమకు మాత్రం లక్ష రూపాయలే ఏందని గోలచేస్తున్నారు. తమకు కూడా రు. 10 లక్షలు ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి ఈ బంధులే కేసీయార్ ను ముంచేసేట్లుగా ఉన్నాయి చూస్తుంటే.