చిన్న‌మ్మ పెద్ద బాంబే పేల్చారుగా!

ఏపీ ప్రభుత్వంపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుపాటి పురంధేశ్వరి ఉర‌ఫ్ చిన్న‌మ్మ‌.. సంచలన ఆరోపణలు చేశారు. ఏపీలో పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్నారు. అరాచక, విధ్వంస పాలన కొనసాగుతోందని ధ్వజమెత్తారు. ఊబిలోకి నెట్టేసినట్లు.. రాష్ట్రం ఆర్ధిక సంక్షోభంలో ఉందని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని కూడా అర్హులైన లబ్ధిదారునికి అందించకుండా.. వచ్చే నిధులను దారి మళ్లించే పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ఎంత దీనావస్థలో ఉందంటే.. చివరికి ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఒకటవ తారీఖున జీతాలు ఇచ్చుకోలేని పరిస్థితుల్లో ఉంది. ఇది ఎంతో బాధాకరమైన విషయం. ప్రజలందరూ ఈ పరిస్థితిపై ఆలోచించాలి. ఉద్యోగస్తులందరూ ఈ జీతం మీదే ఆధారపడి తీసుకున్న వస్తువులపై బ్యాంకుల వద్దకు వెళ్లి.. ఈఏంఐ మీద కాస్త వెసులుబాటు కల్పించాలని ప్రాధేయపడే స్థితిలో ఉన్నారు అని పురందేశ్వ‌రి వ్యాఖ్యానించారు.

గ్రామాలకు 15 ఆర్థిక కమిటీ కింద కేంద్రం నేరుగా ఇస్తున్న సహకారాన్ని సైతం రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లిస్తోందని పురందేశ్వరి ఆరోపించారు. వైసీపీని సమర్థించే సర్పంచులు సైతం.. ఇవ్వాళ బయటకొచ్చి సోషల్ మీడియాలో, ప్రెస్‌లలో తమ వనరుల్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటోందని గోడు వెళ్లబోసుకుంటున్నారని చెప్పారు. ఈ లెక్కన.. మన రాష్ట్రం ఎంత దీనావస్థలో ఉందో ఒఖసారి ప్రజలు గమనించాలన్నారు.

పోనీ.. దారి మళ్లించిన నిధులతో ఎక్కడైనా అభివృద్ధి చేశారా అంటే, అదీ లేదని మండిపడ్డారు. రాష్ట్రంలోని రోడ్లన్నీ గుంతల మయంగా తయారయ్యాయని, ఒక్క పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదని పేర్కొన్నారు. ఉద్యోగాలు లేక రాయలసీమ బిడ్డలు వలసపోతున్నారని పురందేశ్వ‌రి తెలిపారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీజేపీని గెలిపించుకోవ‌డం ద్వారానే ఈ ప‌రిస్థితి నుంచి బ‌య‌ట ప‌డేందుకు అవ‌కాశం ఉంద‌ని పురందేశ్వ‌రి పిలుపునిచ్చారు. ప్ర‌స్తుతం త‌మ ఓటు బ్యాంకు పెరిగింద‌న్నారు.