భార‌త్ జోడో యాత్ర స‌క్సెస్‌.. రాహుల్ ఫెయిల్‌!

దేశంలో వ‌చ్చే ఏడాది జ‌రిగే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకుని అధికారంలోకి రావాల‌ని ఉవ్వి ళ్లూరుతున్న కాంగ్రెస్ పార్టీలో భిన్న‌మైన పరిస్థితి క‌నిపిస్తోంది. ఈ పార్టీని గాడిలో పెట్టేందుకు.. మ‌ళ్లీ అధికారంలోకి తెచ్చేందుకు పార్టీ అగ్ర‌నేత‌రాహుల్‌గాంధీ భార‌త్ జోడో వంటి యాత్ర‌లు చేసిన విష‌యం తెలిసిందే. దీనివల్ల ప్ర‌జ‌ల్లో సానుభూతి పెరిగి.. పార్టీ పుంజుకుంటుంద‌ని ఆయ‌న వేసిన అంచ‌నాలు నిజ‌మ‌య్యాయి.

దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు రెండు ద‌శ‌ల్లో చేసిన భార‌త్ జోడో యాత్ర క‌న్యాకుమారి నుంచి క‌శ్మీర్ వ‌ర‌కు సాగిం ది. రాహుల్‌కు ప్ర‌జ‌లు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. అయితే.. ఈ యాత్ర తాలూకు సింప‌తీ.. పార్టీ కి బాగానే వ‌చ్చింది. కానీ, ప్ర‌ధాని అభ్య‌ర్థిగా రాహుల్‌కు మాత్రం ద‌క్కాల్సిన మార్కులు ద‌క్క‌లేదు. ఇదే విష‌యం.. తాజాగా  ఎన్డీటీవీ–లోక్‌నీతి–సెంటర్‌ ఫర్‌ ద స్టడీ ఆఫ్‌ డెవలపింగ్‌ సొసైటీస్‌(సీఎస్‌డీఎస్‌) సంయుక్తంగా ‘ప్రజాభిప్రాయం’ పేరుతో నిర్వహించిన సర్వేలో స్ప‌ష్ట‌మైంది.

మొత్తంగా 19 రాష్ట్రాల్లోని 71 నియోజకవర్గాల్లో.. 7,202 మందితో నిర్వహించిన ఈ సర్వేలో కాంగ్రెస్ ప‌ట్ల సానుభూతి.. సింప‌తీ రెండూ పెరిగాయి. దీనికి కార‌ణం భార‌త్ జోడో యాత్రేన‌ని ప్ర‌జ‌ల నుంచి స్ప‌ష్ట‌మైన అభిప్రాయం వెల్ల‌డైంది. అదేస‌మ‌యంలో రాహుల్‌గాంధీని ప్ర‌ధాన‌మంత్రి అభ్య‌ర్థిగా ప్ర‌జ‌లు అంగీక‌రించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఈ సర్వేలో పాల్గొన్న 43% మంది బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకే జైకొట్టారు.

బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తుందని అభిప్రాయపడ్డారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే, తమ ఓటు బీజేపీకేనని చెప్పారు. 38% మంది మాత్రం బీజేపీని తిరస్కరిస్తామని స్పష్టం చేశారు. అటు ఓట్ల శాతంలోనూ బీజేపీ 43శాతంతో ముందంజలో ఉందని ఈ సర్వే వెల్లడించింది. అయితే.. 2019లో నిర్వహించిన సర్వేలో వచ్చిన 44% నుంచి బీజేపీ ఒక శాతం కోల్పోవడం గమనార్హం.

అదే సమయంలో కాంగ్రెస్‌ పార్టీ 2019(19%)తో పోలిస్తే.. తాజా సర్వేలో 10% పెరుగుదలను నమోదు చేసుకుంటూ.. 29శాతానికి చేరుకుంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు చేస్తున్న అభివృద్ధి తమకు సంతృప్తినిస్తోందని 55% మంది అభిప్రాయ‌ప‌డ‌గా.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల‌ని 40 శాతం మంది కేవ‌లం 5 శాతం మంది మాత్ర‌మే నేష‌న‌ల్ ఫ్రంట్ వంటి తృతీయ ప‌క్షాల కూట‌మినికోరుతున్నారు. ఇక‌, రాహుల్‌ను ప్ర‌ధానిగా కోరుకుంటున్న‌వారు కేవ‌లం 10 శాతం మంది ఉంటే.. మోడీ విష‌యంలో మాత్రం ఇది 45 శాతంగా ఉంది. ఇత‌రులు మాత్రం సందిగ్ధంలో ఉన్నారు.