మార‌ని తీరు.. కేశినేనిని టీడీపీ వ‌దిలేస్తుందా…!

ఒక రోజు ఒక విధంగా ఉన్నా.. మ‌రుస‌టి రోజైనా మార్పు అనేది రావాల్సిన అవ‌స‌రం ఉంది. రాజ‌కీయాల్లో ప్ర‌త్య‌ర్థుల‌పై విజ‌యం ద‌క్కించుకునేందుకు నాయ‌కులు ముఖ్యంగా ఈ సూత్రాన్ని అవ‌లంభించాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంటుంది. అయితే.. విజ‌య‌వాడ ఎంపీ, టీడీపీ నాయ‌కుడు కేశినేని నాని విష‌యంలో పార్టీ ఆశ‌లు ఆవిరి అవుతున్నాయ‌నే టాక్ జోరుగా వినిపిస్తోంది. ఒక‌వైపు వైసీపీ పై క‌త్తిక‌ట్టిన‌ట్టు చంద్ర‌బాబు వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

వైసీపీ వైఫ‌ల్యాలు అంటూ ప్ర‌జ‌ల మ‌ద్య కు వెళ్తున్నారు.  ప్ర‌జ‌ల‌ను త‌న‌ వైపున‌కు, పార్టీ వైపున‌కు తిప్పుకొనేందుకు చంద్ర‌బాబు క‌ష్ట‌ప‌డుతున్నారు. అయితే.. ఆయ‌న బాట‌లో న‌డ‌వాల్సిన ఎంపీ.. కేశినేని నాని మాత్రం ఒక అడుగు ఇటు మ‌రో అడుగు అటు అన్న విధంగా వ్య‌వ‌హ‌రిస్తుండ‌డం గ‌మ‌నార్హం. వైసీపీ ఎమ్మెల్యేల‌తో ఆయ‌న తెర‌చాటు స్నేహం చేస్తుండడం ఇప్పుడు చ‌ర్చ‌కు దారితీస్తోంది.

మైల‌వ‌రం ఎమ్మెల్యే వ‌సంత కృష్ణ ప్రసాద్‌తో బ‌హిరంగ స్నేహం కొన‌సాగిస్తున్నారు. ఆయ‌నను సంద‌ర్భం వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా కొనియాడుతున్నారు. స‌రే.. దీనికి ఒక రీజ‌న్ ఉంద‌ని అనుకున్నా.. తాజాగా నందిగామ వైసీపీ ఎమ్మెల్యే మొండితోక జ‌గ‌న్మోహ‌న్‌రావుపై మ‌రింత ప్రేమ కురిపించారు కేశినేని. ఆయ‌న‌ను సోద‌రుడు అంటూ వ్యాఖ్యానించారు. త‌న కుటుంబంలో పుట్ట‌క‌పోయినా.. త‌న‌కు సోద‌రుడేన‌ని అన్నారు.

అంతేకాదు.. మొండితోక కోరిన‌ప్పుడల్లా తాను నిధులు ఇస్తున్నాన‌ని చెప్పారు. ఇదే విష‌యాన్ని జ‌గ‌న్మోహ న్‌రావు కూడా అంగీక‌రించారు. ఎంపీ త‌న‌కు పెద్ద‌న్న‌య్య అంటూ.. ఆయ‌న సంబోధించారు. తాను ఎప్పుడు ఫోన్ చేసినా అందుబాటులో ఉంటార‌ని కూడా చెప్పారు. మ‌రి ఈ ప‌రిణామాలు.. టీడీపీకి ఏమేర‌కు మేలు చేస్తాయో.. కేశినేని ఆలోచించుకోవాల‌నేది టీడీపీ నేత‌ల  గుస‌గుస‌. ఇప్ప‌టికైనా తీరు మారుతుందా.. ఎన్నిక‌ల వ‌ర‌కు ఇంతేనా? అనేది చూడాలి.