నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని, జగన్ సర్కారును అంత తేలిగ్గా వదిలేలా లేరు. కొన్ని నెలల నుంచి పార్టీ మీద, ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు, ఆరోపణలతో విరుచుకుపడుతున్న రఘురామ.. ఈ మధ్య కొంచెం నెమ్మదించినట్లు కనిపించారు. కానీ మళ్లీ ఆయన గళం ఊపందుకుంటోంది. ఇటీవలే ఆయనకు కేంద్ర ప్రభుత్వం వై కేటగిరీ రక్షణ కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ ఉత్సాహంలో ఆయన మరింత వాడిగా విమర్శలు మొదలుపెట్టారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన రాజధాని అంశంపై ఆయన మాట్లాడారు. ఈ విషయమై జగన్ సర్కారుపై ఘాటు విమర్శలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొందని.. ఇలాంటి సమయంలో రాజధాని మారుస్తారా అని ఆయన ఎద్దేవా చేశారు.
ప్రభుత్వం మారినప్పుడుల్లా రాజధాని మార్చుకుంటూపోవడం ఏం పద్ధతని ఆయన ప్రశ్నించారు. అమరావతి నుంచి రాజధానిని తరలించాలని పట్టుబడితే.. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులందరికీ నష్టపరిహారం ఇవ్వాల్సి ఉంటుందని.. అందుకు రూ.80 వేల కోట్లు అవసరమవుతాయని ఆయన చెప్పారు. అమరావతిలో రాజధాని వస్తుందని మధ్యతరగతి ప్రజలు దాచుకున్న సొమ్ముతో భూములు కొన్నారని.. దయచేసి వారికి ఇబ్బంది కలిగించొద్దని కోరారు.
అమరావతి నిర్మాణానికి ఎంత ఖర్చు చేశారో తెలపాలని ఏపీ హైకోర్టు కోరడం మంచి పరిణామం అన్న.. రఘురామ రాజధాని విషయంలో రిఫరెండానికి వెళ్లాలని జగన్ ప్రభుత్వాన్ని మరోసారి సవాలు చేశారు. న్యాయవ్యవస్థపై దుష్ప్రచారం ప్రభుత్వానికే నష్టం కల్గుతుందన్న ఆయన.. ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి వ్యక్తిని బెదిరించడం సరికాదన్నారు. తనను కూడా వైకాపా వాళ్లు చాలాసార్లు బెదిరించారని గుర్తుచేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates