సీఎం జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వివేకానందరెడ్డి దారుణ హత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఎం తమ్ముడు, ఎంపీ అవినాష్ రెడ్డి విచారణ.. నాలుగు అడుగులు ముందుకు.. పది అడుగులు వెనక్కి సాగుతోంది. విచారణ పేరుతో అధికారులు ఎంపీని పిలవడం.. ఆయన ఏదో ఒకకారణంగా తప్పించుకోవడం.. జరుగుతూనే ఉంది. తాజాగా అవినాష్ రెడ్డికి సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 22న ఉదయం 11 గంటలకు విచారణకు హాజరుకావాలని ఆదేశాలిచ్చింది.
అయితే, ఎంపీ అవినాష్ మాత్రం మరోసారి సీబీఐకి లేఖ రాశారు. తన తల్లి లక్ష్మీదేవి అనారోగ్యం దృష్ట్యా రేపటి(సోమవారం) విచారణకు హాజరుకాలేనని లేఖలో పేర్కొన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన తల్లి శ్రీలక్ష్మి డిశ్ఛార్జ్ అయిన తర్వాతనే విచారణకు వస్తానని తెలిపారు. కాగా, ఇప్పటికే రెండుసార్లు (ఈనెల 16, 19న) సీబీఐ విచారణకు అవినాష్ రెడ్డి గైర్హాజరయ్యారు. అయితే, అవినాష్ లేఖపై సీబీఐ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.
వాస్తవానికి శుక్రవారం ఉదయం 11 గంటలకు సీబీఐ ఎంపీని విచారించాల్సి ఉంది. దీంతో ఆయన అరెస్టు ఖాయమనే వార్తలు వచ్చాయి. ఇక, పులివెందుల నుంచి హైదరాబాద్ బయలుదేరిన అవినాష్‌రెడ్డి మరికొద్ది సేపట్లో సీబీఐ విచారణకు హాజరవుతారని అనగా.. ఆయన వెంటనే మార్గమధ్యంలో వెనుదిరిగారు. తన మాతృమూర్తికి ఆరోగ్యం బాగోలేదని పులివెందుల నుంచి సమాచారం రావడంతో ఎంపీ వెనుదిరగినట్టు వార్తలు వచ్చాయి.
దీనికి ముందు(16వ తేదీ) కూడా ఎంపీ అవినాష్ విచారణకు రావాల్సి ఉంది. కానీ… ‘ఇంత ఆకస్మికంగా పిలిస్తే రాలేను. ముందస్తు కార్యక్రమాలున్నాయి’ అని తెలిపారు. దీంతో శుక్రవారం(19) తప్పనిసరిగా రావాలని అప్పుడే సీబీఐ అధికారులు చెప్పారు. అవినాష్‌ను అవసరమైతే అరెస్టు కూడా చేస్తామని సీబీఐ ఇదివరకే స్పష్టం చేసిన తరుణంలో ఉత్కంఠ కూడా పెరిగింది. అయితే.. ఇప్పటికి నాలుగు సార్లుగా అవినాష్ విచారణకు రాకుండా ఉండడం గమనార్హం. కారణాలు సహేతుకమే అయినా.. కేసు తీవ్రత దృష్ట్యా.. ఎంపీపై అనుమానాలు వస్తున్నాయన్నది న్యాయ నిపుణుల మాట.
Gulte Telugu Telugu Political and Movie News Updates