నెల్లూరు రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. వైసీపీలోని సొంత నాయకులు అందునా వరుసకు బాబాయి, అబ్బాయి అయ్యేవారే.. రోడ్డున పడ్డారు. నెల్లూరు సిటీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ ఆయన బాబాయి, వైసీపీనాయకుడు డిప్యూటీ మేయర్ రూప్‌కుమార్ యాదవ్ మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరాయి. ఇప్పటికే ఒకరి పై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటుండగా.. రూప్‌కుమార్ అనుచరుడు హాజీపై కొందరు కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు.
ఎమ్మెల్యే అనిల్‌కుమారే కిరాయి మనుషులతో దాడి చేయించారని రూప్‌కుమార్ ఆరోపించారు. మేమంతా కష్టపడి ఎన్నికల్లో అనిల్‌కుమార్‌ను గెలిపిస్తే ఇప్పుడు మాపైనే దాడి చేశారని రూప్‌కుమార్ మండిపడ్డారు. మేం ప్రతీకారం తీర్చుకోవడం మొదలుపెడితే అది నీ ఊహకే అందదంటూ ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌ను ఘాటుగా హెచ్చరించారు. ఇదిలావుంటే, నగరంలో ఎవరు ఎవరి పై దాడి చేసినా.. తనకే అంటగడుతున్నారని ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాను నోరు విప్పితే వారి చరిత్రలన్నీ బయటకు వస్తాయని హెచ్చరించారు. రూప్‌కుమార్ ఒక అంతర్జాతీయ దొంగని.. నోటీసులు వచ్చిన సంగతి మర్చిపోవద్దంటూ అనిల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బెట్టింగ్ వ్యవహారంలో కొందరు చేసిన పాపాలకు ఇప్పటికీ తాను భరించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు.. ఇటీవల నెల్లూరు జిల్లా పర్యటన సందర్భంగా ఇరువురు నేతలను పిలిచి సీఎం జగన్ సర్దిచెప్పారు. కలిసి పని చేయాలని సూచించారు.
ఇది జరిగిన పది రోజులకే ఇరువురు నేతలు వీధికెక్కడంతో వైసీపీ రాజకీయాలు ఆ పార్టీకి చేటు చేయడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు. నిన్న మొన్నటి వరకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్‌రెడ్డిపై విమర్శలు సంధించిన అనిల్ కుమార్ యాదవ్.. ఇప్పుడు బాబాయి వరుసయ్యే నేతపై ఇలా విరుచుకుపడుతుండడంతో పార్టీ అధిష్టానం తలపట్టుకుంది.