ఐదు హామీల పై సంతకం చేసిన సీఎం సిద్ధూ

జెట్ స్పీడ్ మీద దూసుకెళ్లేలా తమ పాలన ఉంటుందన్న స్పష్టమైన సంకేతాల్ని ఇచ్చేశారు కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య. గత శనివారం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడగా.. దాదాపు వారానికి తీవ్రమైన తర్జనభర్జనల అనంతరం ముఖ్యమంత్రిగా సిద్దూ.. ఉప ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ లు పదవీ ప్రమాణ స్వీకారం చేయటం తెలిసిందే. శనివారం తమ ప్రమాణ స్వీకారం ముగిసిన గంటల వ్యవధిలోనే.. మంత్రివర్గసమావేశాన్ని నిర్వహించారు.

ముందుగా నిర్ణయించిన ముహుర్తానికే బెంగళూరులోని శ్రీ కంఠీరవ స్టేడియంలో జరిగిన భారీ కార్యక్రమంలో కర్ణాటక రాష్టర 24వ ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య.. డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ తో పాటు మరో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సభలో మాట్లాడిన రాహుల్ గాంధీ.. ఎన్నికల్లో ఇచ్చిన కీలకమైన ఐదు హామీల్ని వెంటనే నెరవేరుస్తామని.. మరో ఒకట్రెండు గంటల్లో జరిగే తొలి క్యాబినెట్ భేటీలోనే దీనికి సంబంధించిన ప్రకటన ఉంటుందన్న మాటను చెప్పిన రాహుల్ మాటకు తగ్గట్లే.. తర్వాతి పరిణామాలు చోటు చేసుకోవటం గమనార్హం.

ఇందుకు తగ్గట్లే.. తాము ఎన్నికల్లో ఇచ్చిన ఐదు కీలక హామీల అమలుకు ఓకే చెబుతూ సీఎం సిద్ధూ సంతకం చేశారు. దీంతో.. ఎన్నికల వేళలో ఇచ్చిన కీలక హామీలను అమలుకు పచ్చ జెండా ఊపినట్లైంది. ప్రమాణ స్వీకారం చేసిన గంటల వ్యవధిలోనే ముఖ్యమైన ఐదు ఎన్నికల హామీల్ని అమలు చేసేందుకు ఓకే చెప్పేసిన నేపథ్యంలో.. తామిచ్చిన హామీల్నిపూర్తి చేసినట్లుగా ముఖ్యమంత్రి సిద్ధూ పేర్కొన్నారు.క్యాబినెట్ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయనీ విషయాన్ని వెల్లడించారు.

మరో వారం వ్యవధిలో మరో క్యాబినెట్ భేటీ జరుగుతుందని చెప్పిన సిద్ధూ.. తాము సంతకం చేసిన హామీల అమలు అమల్లోకి వస్తాయని చెప్పారు. పార్టీ మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన హామీలపై మాట నిలబెట్టుకున్నట్లైందని పేర్కొన్నారు. ఈ ఐదు హామీల అమలుకు ఏడాదికి రూ.50వేల కోట్ల ఖర్చు అవుతుందన్న విషయాన్ని చెప్పారు. ఆర్థికపరమైన చిక్కులు వచ్చినప్పటికీ.. కన్నడ ప్రజలకు ఇచ్చిన హామీల్నితాము నెరవేర్చామన్నారు. తామిచ్చిన ఐదు హామీల్ని అమలుకు అవసరమైన నిధుల్ని ఖర్చు చేయటం అసాధ్యమని తాను అనుకోవటం లేదన్న సిద్ధూ.. అప్పుల ఊబిలో రాష్ట్రం కూరుకుపోకుండా అన్ని పథకాల్ని అమలు చేస్తామన్న ధీమాను వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా కీలక వ్యాఖ్య చేశారు. రాష్ట్రం చేసిన అప్పునకు వడ్డీ రూపంలో రూ.56వేల కోట్లు ఖర్చు చేస్తున్నప్పుడు.. ప్రజలకు ఇచ్చిన మాటకు తగ్గట్లు.. రూ.50వేలకోట్లు ఖర్చు చేయలేమా? అని పేర్కొన్నారు. సోమవారం నుంచి మూడు రోజుల పాటు సాగే అసెంబ్లీ సమావేశాల్లో స్పీకర్ తో పాటు.. ఎమ్మెల్యేలంతా పదవీ ప్రమాణస్వీకారం చేస్తారని చెప్పారు. సీఎం సిద్ధూ సంతకం చేసిన ఐదు ఎన్నికల హామీలు ఏమంటే..

  1. ‘గృహజ్యోతి’ పథకం కింద గృహావసరాల కోసం 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ అందజేత
  2. ‘గృహలక్షి పథకం’ కింద ఇంటి పెద్ద అయిన మహిళలకు రూ.2,000 నెలసరి సాయం.
  3. ‘అన్న భాగ్య’ పథకం కింద బీపీఎల్ కుటుంబ సభ్యులు ఒక్కొక్కరికి రూ.10 కేజీల ఉచిత బియ్యం అందజేత
  4. ‘యువ నిధి’ పథకం కింద నిరుద్యోగ గ్రాడ్యుయేట్లకు రూ.3,000, డిప్లమో హోల్డర్లకు రూ.1.500 చొప్పున నెలసరి భృతి.
  5. ‘శక్తి’ పేరుతో మహిళలకు ఉచిత ప్రమాణ పథకంలో భాగంగా కర్ణాటక రాష్ట్ర రవాణా సంస్థ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పిస్తారు.