వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహార శైలి కొంతకాలంగా ఏపీతొపాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఓ వైపు వైసీపీని విమర్శిస్తూనే….మరోవైపు, సీఎం జగన్ కు విధేయుడిని అంటున్న రఘురామకృష్ణంరాజు వ్యవహారం వైసీపీ వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది.
నిమ్మగడ్డ వ్యవహారం నుంచి మూడు రాజధానుల బిల్లు ఆమోదం వరకు సందర్భానుసారంగా విమర్శలు గుప్పిస్తోన్న రఘురామకృష్ణంరాజు తాజాగా జగన్ ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ కు అమరావతి గతంలోనూ కలిసి వచ్చిందని, భవిష్యత్తులోనూ కలిసొస్తుందని అన్నారు.
అమరావతిని పరిపాలనా రాజధానిగా కొనసాగించాలని, విశాఖకు రాజధాని తరలించవద్దని చేతులు జోడించి వేడుకుంటున్నానని చెప్పారు. రాజధాని తరలింపు వల్ల నష్టపోతున్న వారికి ధైర్యం చెప్పేందుకు మనోధైర్య యాత్ర చేస్తానని ఆర్ ఆర్ ఆర్ అన్నారు.
అమరావతి రైతులకు న్యాయం జరుగుతోందని, అమరావతిని పరిపాలనా రాజధానిగా కొనసాగించాలని రఘురామకృష్ణం రాజు అన్నారు.
అంతేకాదు, అమరావతిలో ఇల్లు కట్టుకున్నాక జగన్ కు కలిసి వచ్చిందని, భవిష్యత్తులోనూ కలిసి వస్తుందని అన్నారు. అందుకే, అమరావతిని పాలనా రాజధానిగా కొనసాగించాలని, అమరవాతి నుంచే జగన్ పాలన సాగించాలని అన్నారు.
కావాలంటే సీఎం క్యాంప్ ఆఫీస్, లెజిస్లేటివ్ క్యాపిటల్ వేరే చోట పెట్టుకోవాలని, విశాఖ వాసులు కూడా తమకు రాజధాని వద్దనుకుంటున్నారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజధానిని మార్చవద్దని చేతులు జోడించి వేడుకుంటున్నానని, రాజధాని మార్పు వల్ల రైతులు నష్టపోతారని అన్నారు. రాజధాని తరలింపు వల్ల చనిపోయిన వారిని సీఎం జగన్ పరామర్శించాలని, రాజధాని తరలింపు వల్ల నష్టపోతున్న వారికి ధైర్యం చెప్పేందుకు ఎంపీగా ఆగస్టు 20 నుంచి మనోధైర్య యాత్ర చేపట్టబోతున్నానని అన్నారు.
అమరావతిలో రాజధాని కోసం మహిళల నిరసనను కుక్కలతో పోలుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని, కుక్కలు వేట కుక్కలై తరిమేరోజులు దగ్గరలోనే ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. పేరు చివర రెండక్షరాలు ఉన్న వ్యక్తులను కాపాడేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని అన్నారు. విభజన చట్టంలో రాజధాని అనిమాత్రమే ఉందని, ఆ అంశాల ఆధారంగానే కోర్టులో న్యాయం జరుగుతుందని చెప్పారు.
ప్రజాస్వామ్యం లో ఎన్నుకున్న వారిని రాజీనామా చేయమని అనడం సరికాదని బొత్స అన్నారని, అందుకు ఆయనకు కృతజ్ఞతలు అని రఘురామకృష్ణంరాజు చెప్పారు. తన నియోజకవర్గ ఎమ్మెల్యేలు తనను రాజీనామా చేయమంటున్నారని, వారంతా బొత్స వ్యాఖ్యలు దృష్టిలో ఉంచుకోవాలని ఎద్దేవా చేశారు.
మరి, రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యలను జగన్ ఏ విధంగా తీసుకుంటారు…ఆయన సలహాను పాటించి అమరావతి నుంచి పాలన సాగిస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు, రోజు రోజుకు రఘురామకృష్ణంరాజు విమర్శల తీవ్రత పెరుగుతున్నా….వైసీపీ శ్రేణుల మౌనంగా ఉండడంపై కూడా చర్చజరుగుతోంది. ఏది ఏమైనా వైసీపీకి సొంతపార్టీలోనే రఘురామకృష్ణంరాజు మేకయ్యారని చెప్పక తప్పదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates