స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకునే ఉద్యమం రోజురోజుకు ఉధృతమతోంది. సీఎం జగన్ రెడ్డి సహా నేతలంతా తమను మోసం చేశారని ఉక్కు కార్మికులు వాపోతున్నారు. ప్రైవేటీకరణను ఆపేందుకు ప్రభుత్వ పరంగా ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని ఆందోళన చెందుతున్నారు. జగన్ ప్రభుత్వ తీరు ప్రైవేటీకరణకు మద్దతిచ్చేదిగా ఉందని విశాఖ జనం అభిప్రాయపడుతున్నారు. దానితో జగన్ కు షాకివ్వడమే సరైన మార్గమన్న నిర్ణయానికి వచ్చారు.
ప్రవేటీకరణకు వ్యతిరేకంగా ఇప్పటికే నగరంలో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ రెండు టెంట్లు వేసి దీక్షా శిబిరాలను ఏర్పాటు చేసింది. ఇప్పుడు మరో కీలకమైన ప్రదేశంలో టెంట్ వేసి నిరసన తెలపడానికి రెడీ అవుతోంది. సెప్టెంబర్ నుంచి విశాఖలో కాపురం పెడతానని స్వయంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డే ప్రకటించారు.. ఇప్పడు ఈ ప్రకటననే తమకు అనుకూలంగా మార్చుకోవడానికి విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ వ్యూహరచన చేస్తోంది.
ఉక్కు ప్రైవేటీకరణ ప్రకటన వచ్చినప్పటి నుంచి కార్మిక సంఘాలు నగరంలో రెండు టెంట్స్ వేసిన దీక్షా శిబిరాలు నిర్వహిస్తున్నాయి.. కూర్మన్నపాలెం స్టీల్ ప్లాంట్ ఆర్చ్ వద్ద దీక్షా శిబిరం 800 రోజుల మైలు రాయి దాటితే. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద దీక్షా శిబిరం 750 రోజుల మైలు రాయిని దాటింది.
సెప్టెంబర్ నుంచి విశాఖలోనే కాపురం పెడతామని స్వయంగా జగన్ చెప్పారు కాబట్టి..ఆయన నివాసం వద్ద ముడో టెంట్ వేయడానికి విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ రెడీ అవుతోంది. ఇప్పటికే మెజార్టీ కార్మిక సంఘాలు కూడా విశాఖలో జగన్ ఎక్కడ అయితే నివాసం ఉంటారో …అక్కడే మూడో టెంట్ వేసి దీక్షా శిబిరం పెడితే బాగుంటుందని ఒక నిర్ణయానికి వచ్చారు. దానికి ప్రభుత్వం అడ్డు తగిలితే ప్రవేటీకరణకు వాళ్లు మద్దతిస్తున్నట్లవుతుందని ప్రచారం చేసే వీలుంటుంది. పైగా సీఎం నివాసం వద్ద ముడో టెంట్ కు వైసీపీ మంత్రులు, ప్రజాప్రతినిధుల సహకారం కోరుతామని అంటున్నారు. ఏం జరుగుతుందో…
Gulte Telugu Telugu Political and Movie News Updates