కాంగ్రెస్ సాధికారతకు  రూ.50 వేల కోట్లు

కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. ఇచ్చిన  హామీలు నిలబెట్టుకునే టైమ్ వచ్చేసింది.  మొత్తం ఐదు ఉచిత హామీలను కాంగ్రెస్ మేనిఫెస్టోలో చేర్చారు. ఇప్పుడా హామీలే హస్తం పార్టీకి గుదిబండగా  మారే ప్రమాదం ఏర్పడింది. అవి అసలు  హామీలే కావని సాధికారతా ప్రయత్నాలని కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటోంది.

గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్, గృహ లక్ష్మి క్రింద మహిళలకు నెలకు రూ.2,000, అన్న భాగ్య పథకం కింద పేదలకు నెల నెల 10 కిలోల బియ్యం, యువ నిధి కింది  రూ. 3,000 నిరుద్యోగ భృతి, మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం  లాంటి హామీలను నెరవేర్చాల్సి ఉంటుంది.

ఆ ఐదు హామీల భారం ఏడాదికి రూ. 50,000 వేల కోట్లు ఉంటుందని కర్ణాటక కాంగ్రెస్  మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ కేఈ రాధాకృష్ణన్ చెబుతున్నారు. పైగా ఆ మొత్తం చాలా తక్కువేనని ఆయన వాదన. కర్ణాటక ఏడాది బడ్జెట్ రూ.3 లక్షల కోట్లని పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. అందులో రూ.50 వేల కోట్లు పంచిపెట్టడం సులువేనని కాంగ్రెస్ అంటోంది..

మేనిఫెస్టోలో ప్రకటించిన అంశాల్లో కొన్ని పాతవేనని కాంగ్రెస్ చెబుతోంది. గతంలో ఏడు కిలోల బియ్యం ఉచితంగా ఇచ్చేవారని, బీజేపీ దాన్ని ఐదు కిలోలకు తగ్గించిందని, ఇప్పుడు పది కిలోలకు పెంచడం ఒక్కటే తాము చేసిన మార్పు అని కాంగ్రెస్ నేతలు వివరించారు. రాష్ట్రంలో కరెంట్ ఉత్పత్తి పెరిగిపోయి మిగులును ఇతర రాష్ట్రాలకు విక్రయిస్తున్నామని దాన్ని మాత్రమే ప్రజలకు ఇచితంగా అందిస్తామని పార్టీ అంటోంది.