కమ్యూనిస్టులు ముఖ్యంగా సీపీఐ ఆంధ్రప్రదేశ్లో చాలా యాక్టివ్ గా ఉంది. జగన్ ప్రభుత్వ అరాచకాలపై పోరాటంలో కొన్ని సందర్భాల్లో లీడ్ రోల్ కూడా సీపీఐదే. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ రోజు ఏదోక కార్యక్రమంలో పాల్గొంటూ వైసీపీ ప్రభుత్వ తీరును ఎండగడుతుంటారు. అమరావతి రైతుల పోరాటమైనా, విశాఖ ఉక్కు ఉద్యమమైనా సీపీఐ బాధితుల వెంట నిలుస్తూనే ఉంది. ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ రాజకీయ భవిష్యత్తుపై సీపీఐ ఆలోచనలో పడిపోయింది.
రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేనతో కలిసి పోటీ చేస్తామని రామకృష్ణ ప్రకటించేశారు. పైగా బీజేపీతో జతకట్టవద్దని పవన్ కల్యాణ్ కు సూచించారు. దక్షిణాదిన బీజేపీకి అవకాశాలు లేవని అందుకే ఆ పార్టీతో కలవొద్దని పవన్ కు ఆయన హితబోధ చేస్తున్నారు.
నిజానికి పవన్ కు కమ్యూనిస్టు భావాలున్న మాట వాస్తవం. గతంలో వామపక్షాలతో స్నేహం చేసిన మాట నిజం. కాకపోతే 2019లో ఘోరంగా ఓడిపోయిన తర్వాత ఆయన బీజేపీతో స్నేహాన్ని ప్రకటించారు, పొత్తు కూడా ఉంటుందన్నారు, ఇంకా రోడ్ మ్యాప్ ఇవ్వలేదని అభ్యంతరమూ, ఆగ్రహమూ చెందుతున్నారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వబోనని అంటున్న పవన్ కేవలం టీడీపీ, జనసేనతోనే పొత్తు పెట్టుకుంటామని చెబుతూనే ఉన్నారు.
ఐనా ఉద్యమాల్లో, నిరసనల్లో భాగస్వామిగా ఉన్న సీపీఐకి ఆశ చావలేదనుకోవాలి. పవన్ తోనూ, టీడీపీతోనూ కలిసి పోటీ చేయాలనుకుంటోంది.ఆ దిశగానే సంకేతాలిస్తోంది. అయితే ఇప్పటికే డిసైడైపోయిన ఆ రెండు పార్టీలు కమ్యూనిస్టుల ప్రతిపాదనను ఆమోదించే అవకాశాలు తక్కువగానే ఉండొచ్చు. కాకపోతే బీజేపీతో పొత్తు కుదరని పక్షంలో వామపక్షాలతో కలిసిపోయేందుకు కొంత మేర అవకాశాలున్నాయి. మహా అయితే ఒకటి రెండు ఎమ్మెల్యే సీట్లను వారికి వదిలేసే వీలుంటుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates