కాంగ్రెస్ పార్టీలోకి రావాలంటూ.. ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వరరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ వంటివారి ని.. హస్తం పార్టీ తెలంగాణ చీఫ్ రేవంత్‌రెడ్డి ఆహ్వానించడం సంచలనంగా మారింది. తెలంగాణలో గెలిచేది కాంగ్రెస్ పార్టీయేనని.. బీజేపీ సమ ఉజ్జీ కాదని.. సో.. పార్టీ మారి వచ్చేయాలని వారికి రేవంత్ పిలుపునిచ్చా రు. అంతేకాదు.. క్షణికావేశంలో నేబీజేపీలో చేరి ఉంటారని.. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత.. బీజేపీకి, మోడీకి ఉన్న ఇమేజ్ కూడా తేలిపోయిందని రేవంత్ రెడ్డి చెప్పు కొచ్చారు.
అయితే, రేవంత్ వ్యాఖ్యలపై ఈటల రాజేందర్ ఫైర్ అయ్యారు. రేవంత్‌వి చిల్లర రాజకీయాలు అంటూ.. ఎద్దేవా చేశారు. కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి సహా ఎవరూ బీజేపీని వీడరని, బీజేపీ నుంచి బయటకు వెళ్లే ప్రసక్తే లేదని ఈటల స్పష్టం చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనను ఆ పార్టీ నుంచి బయటకు పంపిన నాడు తనకు బీజేపీ గౌరవం, ధైర్యం ఇచ్చిందని ఈటల వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నేతలే బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.
కేసీఆర్‌ను చిత్తుగా ఓడించగలిగే శక్తి బీజేపీకి మాత్రమే ఉందని ఈటల స్పష్టం చేశారు. తాను కానీ.. ఇతర నాయకులు కానీ క్షణికావేశంతో బీజేపీ తీర్థం పుచ్చుకోలేదన్నారు. అన్నీ ఆలోచించుకునే పూర్తిస్థాయి ఆలోచనతోనే బీజేపీలో చేరామని ఆయన చెప్పారు. ఈటల రాజేందర్ క్యారెక్టర్.. తెరిచిన పుస్తకమని, రేవంత్ చిల్లర మాటలకు జవాబు చెప్పాల్సిన అవసరం లేదని ఈటల మండిపడ్డారు. వచ్చే ఎన్నికలకు బీజేపీ వ్యూహాలు బీజేపీకి ఉన్నాయని చెప్పారు.
కర్ణాటకలో బీజేపీ ఓటమిపై తాను ఏమీ మాట్లాడబోనన్న ఆయన ప్రస్తుతం ఈ ఓటమిపై బీజేపీ పెద్దలు అంతర్గత చర్చలు చేస్తున్నారని తెలిపారు. ఇది తమకు ఒక లెస్సన్ మాదిరిగా ఉపయోగపడుతుందని.. ఈ ఏడాది వచ్చే ఎన్నికల్లో అన్ని విధాలా తమ పోరాటం కొనసాగుతుందని తెలిపారు.