కర్నాటక సీఎం రేసులో ఊహించని పేరు

పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీర్చిందనే సామెత కర్నాటక కాంగ్రెస్ కు సరిగ్గా సరిపోతుందేమో. మొన్నటి ఎన్నికల్లో అద్భుతమైన విజయం సాధించి ఐదురోజులు అయినా ఇంతవరకు సీఎం ఎవరో తేల్చుకోలేకపోతున్నారు. సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఇద్దరూ ఎవరికి వాళ్ళే ముఖ్యమంత్రి పదవి కావాలని పట్టుబడుతున్నారు. ఇద్దరికీ ప్లస్సులున్నాయి మైనస్సులున్నాయి. దాంతో ఎవరిని నియమించాలో అర్ధంకాక అధిష్టానం నానా అవస్తలు పడుతున్నది. సరిగ్గా ఈ నేపధ్యంలోనే కొత్తగా మరోపేరు తెరపైకి వచ్చింది.

ఇంతకీ ఆ కొత్తపేరు ఎవరిదంటే మల్లికార్డున ఖర్గేదే. ఏఐసీసీ అధ్యక్షుడిగా ఉన్న ఖర్గేనే సీఎంను చేయాలనే ప్రతిపాదన కొత్తగా మొదలైంది. ఇటు సిద్ధూ అటు డీకే ఇద్దరిలో ఎవరు తగ్గకపోవటంతో మధ్యేమార్గంగా ఖర్గేని సీఎంగా చేస్తే సమస్య పరిష్కారమవుతుందని కొత్త ప్రతిపాదన తెరమీదకు వచ్చింది. పైగా ఖర్గే ఎస్సీ నేత కాబట్టి పార్టీకి అడ్వాంటేజ్ అవుతుందనే ప్రచారం పెరిగిపోతోంది. సిద్ధూకి ఉన్న ప్లస్ పాయింట్లు ఏమిటంటే బాగా సీనియర్, ఇదివరకే ముఖ్యమంత్రిగా చేసుండటం. మైనస్ పాయింట్లు ఏమిటంటే జేడీఎస్+కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవటంలో తెరవెనుక పాత్ర సిద్ధూదే అనే ఆరోపణలు.

పైగా ఇప్పటికే సిద్ధూ అనేక కీలకమైన పదవులను పనిచేయటం. ఎన్ని పదవులైనా సిద్ధూకి మాత్రమేనా వేరే నేతలు ఎవరూ కనబడటంలేదా అధిష్టానానికి అనే అసంతృప్తి పెరిగిపోతోంది. ఇక డీకే విషయం చూస్తే సీబీఐ, ఈడీ నమోదుచేసిన 19 కేసులే అతిపెద్ద మైనస్. ఇప్పటికే అరెస్టయి బెయిల్ మీదుంటం ప్రతికూలంగా మారింది. సీఎం అవ్వగానే దర్యాప్తుసంస్ధలు డీకేని అరెస్టుచేస్తే పార్టీ పరువు పోతుందన్నది కీలకమైన పాయింట్.

సరిగ్గా ఈ నేపధ్యంలోనే కొందరు సీనియర్ల ఖర్గే పేరును ప్రతిపాదించారట. ఖర్గే సీఎం అయ్యేందుకు సుముఖంగా లేకపోయినా పేరుమాత్రం ప్రచారంలో ఉంది. పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఇంట్లో సిద్ధూ, డీకేని ముఖాముఖి కుర్చోబెట్టి వాళ్ళనే తేల్చుకోవాలని అధిష్టానం నిర్ణయించినట్లు తాజా వార్తలు వినబడుతున్నాయి. బహుశా సాయంత్రానికి నిర్ణయం తీసుకోవచ్చని అనుకుంటున్నారు. మరి చివరకు ఏమి జరుగుతుందో చూడాలి.