అమ‌రావ‌తిలో పేద‌ల‌కు ప‌ట్టాలు.. ఇచ్చినా ప్ర‌యోజ‌నం లేన‌ట్టే

ఏపీ రాజ‌ధాని అమ‌రావతి ప్రాంతంలోని ఆర్‌5 జోన్‌లో పేద‌ల‌కు ప‌ట్టాలు ఇవ్వ‌డాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న జ‌గ‌న్ స‌ర్కారుకు ఇంటా బ‌య‌టా కూడా పొగ.. సెగ పెరిగింది. ఈ జోన్‌లో ఇళ్ల ప‌ట్టాలు ఇవ్వ‌డం ద్వారా మంగ‌ళ‌గిరిలో నారా లోకేష్‌ను ఓడించాల‌నే ల‌క్ష్యం నెర‌వేరేలా క‌నిపించ‌డం లేదు. తాజాగా సుప్రీంకోర్టు ఈ విష‌యంపై సంచ‌ల‌న ఆదేశాలు జారీ చేసింది. ప‌ట్టాలు ఇచ్చినా.. తుది తీర్పున‌కు లోబ‌డి ఉండాల‌ని, అంతేకాకుండా.. ప‌ట్టాలు పొందే వారికి ఎలాంటి హ‌క్కులు ఉండ‌బోవ‌ని.. రేపు న్యాయ‌ప‌రంగా వారికి ఎలాంటి ర‌క్ష‌ణా ఉండ‌ద‌ని తేల్చి చెప్పింది.

అంటే.. ఇంత ఆర్భాటంగా.. జ‌గ‌న్ స‌ర్కారు చేస్తున్న ప్ర‌య‌త్నం.. రేపు తేడా వ‌స్తే.. ఎందుకూ కొర‌గాకుండా పోతుంది. అదేస‌మ యంలో ప‌ట్టాలు పొందిన పేద‌ల‌కు కూడా ఎలాంటి హ‌క్కులూ ఉండ‌వు అనేది స్ప‌ష్టంగా తేలిపోయింది. ఆర్‌5 జోన్‌ అంశంపై సుప్రీంకోర్టులో వాదనలు జ‌రిగాయి. ఏపీ ప్రభుత్వం తరఫున న్యాయవాది అభిషేక్‌ మనుసింఘ్వీ వాదనలు వినిపించారు. 2023 మార్చి 21న ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ నోటిఫికేషన్ ఇచ్చిందని, మొత్తం 34 వేల ఎకరాల్లో 900 ఎకరాలు కేటాయించారని తెలిపారు. కేసులన్నీ వ్యక్తిగతంగా వేసినవేనని, అవేవీ ప్రజాప్రయోజన వ్యాజ్యాలు కాదని అభిషేక్‌ మనుసింఘ్వీ వాదించారు.

ప్లాట్ల కేటాయింపు ప్రక్రియ ఇప్పటికే పూర్తయిందని, వారి తరఫునే వాదిస్తున్నాం అని తెలిపారు. ఆర్‌-3 జోన్‌లో మాత్రమే భూమి తీసుకోవడానికి అవకాశం ఉందని, కావాలంటే ఈ సిటీకి మరో 900 ఎకరాలు కేటాయించుకోవచ్చు అని పేర్కొన్నారు. సిటీకి ఇచ్చిన 6500 ఎకరాల్లో 900 ఎకరాలు తీసుకోవద్దంటే ఎలా? అని అన్నారు. కాగా, ఒకసారి పట్టాలిస్తే మాస్టర్‌ప్లాన్‌ను విధ్వంసం చేసినట్లే అని రైతుల తరఫు న్యాయవాది వాదించారు. పట్టాలు ఇచ్చేస్తే తిరిగి ఆయా భూముల‌ను తీసుకోలేమని పేర్కొన్నారు. రాష్ట్రం, దేశ ప్రయోజనాల కోసం రైతులు భూములిచ్చారని తెలిపారు.

ఒక మహానగరం వస్తుందని హామీ ఇచ్చారని, ఉద్యోగాలు, అనుబంధ పరిశ్రమలు వస్తాయని ఆశ చూపడంతో 29 గ్రామాల ప్రజలు ఆ మాటలు నమ్మారని కోర్టుకు విన్నవించారు. ప్రభుత్వం మాట నమ్మి.. ఎలాంటి ఆర్థిక పరిహారం తీసుకోకుండా వేల ఎకరాలు ఇచ్చారని గుర్తు చేశారు. మాస్టర్‌ప్లాన్ ప్రకారం అభివృద్ధిపై ప్రచారం చేసిన అధికారులు.. నవ నగరాలు ప్రతిపాదించారని తెలిపారు. నవ నగరాల అభివృద్ధితో ఎన్నో అవకాశాలు వస్తాయని, ఆర్థిక కార్యకలాపాలు పెరిగి రూపురేఖలు మారతాయని రైతులు ఆశించినట్లు తెలిపారు.

నవ నగరాల్లోని ప్రతి నగరంలో రెసిడెన్షియల్ జోన్ ఉన్నట్లు తెలియజేస్తూ.. ఆర్థికంగా వెనకబడిన వారికి 5 శాతం భూములివ్వా లని, రెసిడెన్షియల్ జోన్ల నిబంధనల ప్రకారం కేటాయింపులుండాలని అన్నారు. ప్రభుత్వాలు మారితే ఇచ్చిన హామీలు పక్కన పెట్టలేరని గుర్తుచేస్తూ.. కోర్టు తీర్పులకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని తెలిపారు. జులైలో తుది విచారణ జరగాల్సి ఉందని, అంతకుముందే పట్టాలిస్తే ఇక చేయడానికి ఏం ఉంటుందని రైతుల తరఫు న్యాయవాది సందేహం వ్యక్తం చేశారు. దీంతో సుప్రీం కోర్టు పైవిధంగా ఆదేశాలు జారీ చేసింది.