వ‌చ్చే ఎన్నిక‌ల్లో 105 సీట్లు మ‌న‌వే..: కేసీఆర్

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ తాజాగా సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో మరోసారి బీఆర్ఎస్నే పాగా వేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. దాదాపు 95 నుంచి 105 సీట్లు ఖాయమని వెల్లడించారు. రాష్ట్రాభివృద్ధి దశాబ్ది వేడుకలు ఘనంగా జరపాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని, పార్టీ శ్రేణులు ప్రజలతో మమేకం కావాలని తెలిపారు. సర్వేలన్నీ బీఆర్ఎస్కే అనుకూలంగా ఉన్నాయ‌ని కేసీఆర్ చెప్పుకొచ్చారు.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మరోసారి విజయఢంకా మోగించడం తథ్యమని కేసీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు. వందకు పైగా సీట్లలో గులాబీ అభ్యర్థులు గెలవటం ఖాయమన్నారు. సర్వేలన్నీ బీఆర్ఎస్కే అనుకూలంగా ఉన్నాయని తెలంగాణ భవన్‌లో జరిగిన విస్తృతస్థాయి భేటీలో చెప్పారు. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు పాల్గొన్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలను ఆయా జిల్లాలకు చెందిన మంత్రులు సమన్వయం చేసుకోవాలని సూచించారు.

తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను అట్టహాసంగా నిర్వహించాలని బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. దశాబ్దంలో శతాబ్ది అభివృద్ధి చేశామని వివరించిన సీఎం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. 21 రోజుల పాటు పండగ వాతావరణంలో వేడుకలు జరపాలని సీఎం ఆదేశించినట్లు సమావేశం అనంతరం బీఆర్ఎస్ నేతలు పేర్కొన్నారు. పార్టీ, ప్రభుత్వం తరఫున సంబురాలు అంబరాన్ని అంటేలా నిర్వహిస్తామని చెప్పారు.

దశాబ్ది ఉత్సవాల కమిటిని సీఎం కేసీఆర్‌ నియామించారు. రాష్ట్రప్రభుత్వప్రధాన కార్యదర్శి అధ్యక్షతన రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల కమిటీని ఏర్పాటు చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. సభ్యులుగా ప్రభుత్వ సలహాదారు కేవీ రమణ, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, వివిధ శాఖల ఉన్నతాధికారులు వ్యవహరించనున్నారు. దశాబ్ది ఉత్సవాల కమిటీ కన్వీనర్‌గా ఐ అండ్ పీఆర్ స్పెషల్ కమిషనర్‌ను ప్రభుత్వం నియమించింది.