కమ్యూనిస్టుల ప్రభావం ఉన్న రోజుల్లో, జనం కేపిటల్ చదివే రోజుల్లో ‘క్లాస్ వార్’ ఓ అందమైన, ఆకర్షణీయమైన పదం. పేద, మధ్య తరగతి వర్గాలకు బాగా నచ్చిన పదం. రాబిన్ హుడ్ తరహాలో ఆలోచించే వారికి అదీ నచ్చిన పదం. పెద్దలను కొట్టు, పేదలకు పెట్టు అన్న చందంగా ప్రచారమైన పదం. చాన్నాళ్లుగా జనం ఆ పదాన్ని వాడటం మానేశారు. సాఫ్ట్ వేర్ యుగంతో హావ్స్, హావ్ నాట్స్ అనే మాటలు మరిచిపోయి, ఎవరి పని వాళ్లు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఏపీ సీఎం జగన్ పుణ్యమాని క్లాస్ వార్ అనే మాట మళ్లీ తెరపైకి వచ్చింది.
వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వబోనని పవన్ ప్రకటించిన తర్వాత క్లాస్ వార్ అనే మాటను జగన్ వాడేశారు. ఏపీలో ఉన్నదీ క్యాస్ట్ వార్ కాదని, క్లాస్ వార్ అని అనేశారు. పేదలకు కులం లేదని, ఆకలి మాత్రమే వారి కులమని జగన్ చెప్పేశారు.తాను పేదల పక్షం వహించి వారి కోసం అనేక సంక్షేమ పధకాలను అమలు చేస్తూంటే పెత్తందార్లు అంతా కూటమిని కడుతున్నారని జగన్ మండిపడ్డారు. పేదవారికి ఏ మేలూ చేయరాదు అన్నదే టీడీపీ సహా విపక్షాల పంతం పట్టుదల అని ఆయన అంటున్నారు. క్లాస్ ఎనిమీస్ నుంచి పేదలను బయట పడేసే సత్తా తనకే ఉందని జగన్ చెప్పుకుంటున్నారు.
నిజానికి పవన్ కల్యాణ్ ఒకప్పుడు కమ్యూనిస్టు మిత్రుడు. చెగువేరా గురించి ఎక్కువ మాట్లాడేవారు. ఇప్పుడు ఎందుకో కాస్త తగ్గించారు. జగన్ క్లాస్ వార్ ఎత్తుకున్న తర్వాత పవన్ మళ్లీ ఆయనపై విరుచుకుపడేందుకు కమ్యూనిస్టు యోధుల పేర్లు ప్రస్తావిస్తూ ట్వీట్ చేశారు. జగన్ తరిమెళ్ల నాగిరెడ్డి కాదూ, పుచ్చలపల్లి సుందరయ్య కాదు.. ఆయన ఎవరూ క్లాస్ వార్ అనే మాట వాడటానికి అని పవన్ ప్రశ్నిస్తున్నారు.
సూటుకేసుల నిండా డబ్బులు పెట్టుకుని మనీలాండరింగ్ చేసే ఏపీ ముఖ్యమంత్రికి క్లాస్ వార్ పై మాట్లాడే హక్కు ఎక్కడిదని పవన్ ప్రశ్న. ఈ సందర్బంగా నాటి పాపం పసివాడు సినిమా పోస్టర్ ను ట్వీట్ చేస్తూ.. జగన్ హీరోగా నటించే సినిమా కోసం రాజస్థాన్ ఎడారి నుంచి ఇనుక తిన్నెలను తీసుకు రావాల్సిన అవసరం లేదని,వైసీపీ దోచుకున్న ఇసుక చాలని పవన్ అంటున్నారు. అక్రమ సంపాదనతో జనాన్ని హింసిస్తున్న జగన్ కు క్లాస్ వార్ అనే మాటను ఉచ్ఛరించే హక్కు కూడా లేదని పవన్ అంటున్నారు. ఏదోక రోజున రాయలసీమ మీ నుంచి విముక్తి పొందుతుందని పవన్ ట్వీట్ చేశారు..
క్లాస్ వార్ రాయలసీమ వైపు మళ్లితేనే ఇప్పుడు సమస్య. సీమ ప్రజలు జగన్ ను ఓన్ చేసుకోవడం మానేసి చాలా రోజులైంది. ఇప్పుడు ఆ మాట అనడం ద్వారా తాను చెప్పాలనుకున్న సందేశాన్ని పవన్ దారిమళ్లించినట్లయ్యే ప్రమాదం ఉంది. సీమ జనం అప్పుడే సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలు పెట్టారు. పవర్ స్టార్ జర జాగ్రత్త..