కర్ణాటకలో కాంగ్రెస్ సాధించిన ఘన విజయం వెనుక కనిపించని వ్యూహకర్త ఒకరున్నారు. పార్టీ ముఖ్యనేతలు.. పార్టీ అధినాయకత్వానికి నిత్యం సూచనలు.. సలహాలు ఇస్తూ నడిపించిన అతని గురించి ఇప్పుడు చర్చ మొదలైంది.కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి థింక్ ట్యాంకర్ గా వ్యవహరించారు సునీల్ కనుగోలు. కర్ణాటక విజయంలో కీలకభూమిక పోషించారని చెబుతున్నారు. ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీకి చీఫ్ ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరిస్తున్న ఆయన ఎవరు? అతడి బ్యాక్ గ్రౌండ్ ఏమిటి? అతడి పని తీరు ఎలా ఉంటుంది? అన్నది ఆసక్తికరంగా మారింది.
కర్ణాటకలోని బళ్లారిలో సునీల్ పుట్టారు.చదువు నిమిత్తం చెన్నైకు మకాం మార్చిన అతను అమెరికాకు వెళ్లి ఎంబీఏ చదివారు. అక్కడే అంతర్జాతీయ మేనేజ్ మెంట్ కన్సల్టెంట్ మెకన్సీ కోసం పని చేసిన అతను.. ఆ తర్వాత తిరిగి వచ్చి గుజరాత్ రాజకీయాల్లోకి వ్యూహకర్తగా ఎంట్రీ ఇచ్చారు. 2014 ఎన్నికల్లో మోడీ వ్యూహకర్తల టీంలోని ముఖ్యుల్లో సునీల్ ఒకరు. బీజేపీ కోసం యూపీ ఎన్నికల్లో పని చేసి.. 2019లో తమిళనాడులో స్టాలిన్ కోసం పని చేశారు. డీఎంకేకు 38 స్థానాల్లో విజయం సాధించటంలో కీలకభూమిక అతడిదే.
అనంతరం డీఎంకేకు ప్రశాంత్ కిశోర్ కు చెందిన ఐప్యాక్ ఎంట్రీ ఇవ్వటంతో తమిళనాడు నుంచి కర్ణాటకకు షిఫ్టుఅయ్యారు. బెంగళూరుకు వెళ్లిన అతను 2021 అసెంబ్లీ ఎన్నికల్లో నాటి ముఖ్యమంత్రి పళని స్వామి రిక్వెస్టుతో అన్నాడీఎంకే తరఫున పని చేశారు. పెద్దగా ఫలితం లేకపోయింది. గత ఏడాది మార్చిలో కాంగ్రెస్ తో సునీల్ కనుగోలు జట్టు కడతారన్న ప్రచారం జరిగింది. దీంతో.. కర్ణాటక సీఎం బొమ్మై సునీల్ ను బీజేపీలోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. కానీ.. అందుకు సునీల్ ఒప్పుకోలేదు. తాను కాంగ్రెస్ ఐడియాలజీని నమ్ముతున్నట్లుగాపేర్కొంటూ.. ఆ పార్టీకి సేవలు అందించే పనిలో పడ్డారు. రాహుల్ భారత్ జోడో యాత్రలోనూ సునీల్ పాత్ర ఉందని చెబుతారు.
కాంగ్రెస్ లోని వర్గపోరు ఎంతన్న విషయం సునీల్ కు బాగానే తెలుసు. అందుకే. ఆయన తొలుత సిద్దరామయ్య.. డీకే శివకుమార్ వర్గాలను ఏకతాటి మీదకు తీసుకొచ్చేలా పని చేశారు. కర్ణాటక కాంట్రాక్టర్స్ అసోసియేషన్ సీఎం బొమ్మైపై చేసిన 40శాతం కమిషన్లు తీసుకుంటున్నట్లుగా చేసిన ఆరోపణను అవకాశంగా తీసుకొని ‘పేసీఎం’ పేరుతో ప్రచారాన్ని మొదలుపెట్టారు. భావోద్వేగాల్నిరెచ్చగొట్టేలా బీజేపీ ఎన్నికల ప్లానింగ్ నడిస్తే.. కాంగ్రెస్ మాత్రం అందుకు భిన్నంగా సామాన్యులను ప్రభావితం చేసే అంశాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు.
టికెట్ల పంపిణీలోనూ సునీల్ కీలకంగా వ్యవహరించారు. ఆయన టీం చేసిన సర్వేల ఆధారంగా టికెట్ల పంపిణీ చేపట్టారు. ఇలా మొత్తంగా అన్ని అంశాల మీద ఫోకస్ చేసిన సునీల్ శ్రమ ఫలించింది. కర్ణాటకలో కాంగ్రెస్ ఘన విజయాన్ని సాధించింది. బీజేపీని నిలువరించటం కోసం.. కాంగ్రెస్ గెలుపు కోసం రోజుకు 20 గంటలు శ్రమించాల్సి వచ్చినట్లుగా సునీల్ కనుగోలు ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
నిజానికి మీడియాకు దూరంగా ఉండే సునీల్ లో మరో ప్రత్యేకత ఉందని చెబుతారు. ప్రచారానికి దూరంగా.. ప్రొఫైల్ బిల్డింగ్ అన్నది తనకు అవసరం లేదన్నట్లుగా వ్యవహరిస్తుంటారు. చివరకు సోషల్ మీడియాలోనూ తన ఫోటోను పెట్టకుండా జాగ్రత్తలు తీసుకోవటం అతనికే చెల్లుతుందంటున్నారు. కర్ణాటక విజయం అనంతరం త్వరలో జరిగే తెలంగాణ.. ఛత్తీస్ గఢ్.. రాజస్థాన్.. మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల కోసం పని చేయున్నారు. సునీల్ కనుగోలు మేజిక్ ఏ మేరకు ఫలిస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరి.. ఈ నాలుగు రాష్ట్రాల్లో ఫలితం ఏ రీతిలో ఉంటాయో చూడాలి.