కాంగ్రెస్‌ను బలహీనం చేయడమే తక్షణ లక్ష్యం

కర్ణాటక ఫలితాలు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని టెన్షన్ పెడుతున్నాయి. బీజేపీ ఓటమి ఆ పార్టీ వర్గాల్లో సంతోషాన్ని కలిగిస్తున్నా కాంగ్రెస్ గణనీయంగా ఓట్ల శాతాన్ని పెంచుకోవటం బీఆర్ఎస్‌లో భయం కలిగిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ – కర్ణాటక ప్రాంతంలో కాంగ్రెస్ 50 శాతానికి పైగా స్థానాలు కాంగ్రెస్ గెలుచుకోవడంతో పొరుగునే ఉన్న తెలంగాణలో ఆ ప్రభావం తీవ్రంగా ఉంటుందని బీఆర్ఎస్ టెన్షన్ పడుతోంది.

హైదరాబాద్–కర్ణాటక ప్రాంతంలో మొత్తం 41 అసెంబ్లీ స్థానాలు ఉండగా కాంగ్రెస్ 24 స్థానాల్లో విజయబావుటా ఎగురవేయటం బీఆర్ఎస్ నాయకుల్లో ఆందోళనను కలిగిస్తోంది. పైకి కర్ణాటక ఎన్నికల ప్రభావం తెలంగాణపై ఉండదని చెబుతున్నా లోలోపల మాత్రం కాంగ్రెస్ అక్కడ ఇంత బలంగా పుంజుకోవటం వెనక ఉన్న కారణాలేమిటన్న అంశంపై బీఆర్ఎస్ అగ్రశ్రేణి నాయకులు విశ్లేషణలు చేస్తున్నారు. కర్ణాటకలో హంగ్ ఏర్పడవచ్చని బీఆర్ఎస్ నాయకులు భావించారు.

తమ మిత్రుడు, జేడీఎస్ పార్టీ అధ్యక్షుడైన కుమారస్వామి ప్రభుత్వ ఏర్పాటులో కింగ్మేకర్కాగలడని అనుకున్నారు. అయితే అంచనాలు పూర్తిగా తలకిందులు కావటంతో బీఆర్ఎస్ నేతలు ఆలోచనలో పడ్డారు. కాంగ్రెస్ విజయానికి కారణాలు ఏమిటి? స్థానిక పరిస్థితులా? రాహుల్గాంధీ జరిపిన భారత్ జోడో యాత్ర ప్రభావమా? ఆ పార్టీపై ప్రజల్లో ఆదరణ పెరగటమా? అన్న అంశాలపై ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా వివరాలు తెప్పించుకుంటున్నారు. కర్ణాటక ప్రభావం తెలంగాణలో లేకుండా ఏం చేయాలనేదీ ఆలోచిస్తున్నారు.

తెలంగాణలో ఎన్నికల హీట్ ఇప్పటికే మొదలైన విషయం తెలిసిందే. హ్యాట్రిక్ సాధిస్తామని బీఆర్ఎస్ ధీమా వ్యక్తం చేస్తుంటే ఈసారి విజయం తమదేనని బీజేపీ నాయకులు చెబుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ తెలంగాణలో ఈసారి ప్రభుత్వాన్ని తమ పార్టీయే ఏర్పాటు చేస్తుందని అంటున్నారు. తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.

టీఎస్పీఎస్సీ బోర్డు పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీ, నిరుద్యోగం, పంట కొనుగోళ్లు, ఓఆర్ఆర్ కాంట్రాక్టును తక్కువకే కేటాయించటం ఇలా దొరికిన ప్రతీ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళుతూ బీఆర్ఎస్ నాయకులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. దళిత బంధు పథకంలో ఎమ్మెల్యేలు పర్సంటేజీలు తీసుకున్నట్టుగా తన వద్ద సమాచారం ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత పార్టీ నేతలతో జరిపిన సమావేశంలో వ్యాఖ్యానించారంటూ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. బీఆర్ఎస్ నాయకుల అవినీతికి ముఖ్యమంత్రి వ్యాఖ్యలే అద్దం పడుతున్నాయని పదునైన వ్యాఖ్యలు చేస్తున్నారు.

కర్ణాటకలోనూ బీజేపీ అవినీతినే ప్రధానంగా ఫోకస్ చేసి కాంగ్రెస్ లాభపడింది. ఇప్పుడు స్వయంగా కేసీఆర్ ఎమ్మెల్యేల అవినీతి గురించి మాట్లాడడంతో ఇక్కడా కాంగ్రెస్ పార్టీ అదే అంశాన్ని ఎత్తుకుని ఎన్నికలకు వెళ్లడానికి రెడీ అవుతోంది. దీంతో బీఆర్ఎస్‌లో భయం మొదలైంది. పైకి ఎంత ధీమా వ్యక్తంచేస్తున్నా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ జోరు మీదున్న సంగతి బీఆర్ఎస్ నేతల్లోనూ చాలామంది అర్థం చేసుకున్నారు. ఇప్పుడు కర్ణాటక ఫలితాలతో ఆ జోరు మరింత పెరిగితే మూడో సారి అధికారంలోకి రావాలన్న తమ ఆశలు నెరవేరవేమో అని బీఆర్ఎస్ బెంగపడుతోంది. దీంతో స్ట్రాటజీ మార్చి కాంగ్రెస్‌ను దెబ్బతీసే వ్యూహాలు, ఆ పార్టీ నేతలను ఆకర్షించే వ్యూహాలతో ముందుకెళ్లాలని కేసీఆర్ యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది.