రాజకీయ నాయకుల మీద అభిమానం హద్దులు దాటితే, అధికార మదం తలకెక్కితే ఎలా ఉంటుందనడానికి ఇది తాజాగా ఉదాహరణ. ప్రస్తుతం తిరుపతిలో గంగమ్మ జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. అక్కడ గంగమ్మ గుడిని కనువిందు చేసేలా అలంకరించారు. ఇదంతా బాగానే ఉంది కానీ.. ఆ గుడిలో జగన్ అభిమానులు కొందరు అత్యుత్సాహం ప్రదర్శించారు.
ముఖ ద్వారం వద్ద చేసిన పూల అలంకరణలో J అక్షరం.. దాని పక్కన గన్ సింబల్ పెట్టారు. అంటే దాన్ని ‘జగన్’ అని చదువుకోవాలన్నమాట. దీంతో పాటుగా వైసీపీ జెండా రంగులు కూడా ఎలివేట్ అయ్యేలా ఈ అలంకరణ చేశారు. దేవుడి గుడిలో ఇలా సీఎం జగన్ పేరుతో పూల అలంకరణ చేయడమే అభ్యంతరకరం అంటే.. అందులో ‘గన్’ అనే పదం బదులు.. తుపాకీనే పెట్టడం మరీ విడ్డూరం. ఇది వైసీపీ వాళ్లకు ఎలా అనిపిస్తుందో ఏమో కానీ.. సామాన్య జనాలకు మాత్రం తీవ్ర అభ్యంతరకరంగానే అనిపిస్తోంది.
తిరుపతి జనాలు ఈ విడ్డూరం చూసి విస్తుబోతున్నారు. దేవుడి గుడిలో ఈ ఆటలేంటి అని ఇలా చేసిన వారిని తూర్పారబడుతున్నారు. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. స్వయంగా తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు కూడా దీని మీద స్పందించారు. ‘‘తిరుపతి గంగమ్మ గుడికి ఇలాంటి అలంకారమా? దేవుని సన్నిధిలో ఈ ‘గన్’ సంస్కృతి ఏంటి? వైసీపీ జెండా గుర్తులు ఏంటి? పిచ్చి పట్టిందా? మీ ప్రచార పిచ్చితో, అహంకారంతో దేవుళ్ళ దగ్గర ఇలాంటి వేషాలా?’’ అని ఆయన ట్వీట్ వేశారు.
తెలుగుదేశం, జనసేన వాళ్లే కాక చాలామంది ఈ విషయాన్ని తప్పుబడుతూ సోషల్ మీడియాలో ఈ ఫొటోను వైరల్ చేస్తున్నారు. అసలే జగన్ సర్కారు మీద రోజు రోజుకూ వ్యతిరేకత పెరుగుతోంది. తిరుమలలో కొన్నేళ్లుగా జరుగుతున్న అనేక అభ్యంతరకర విషయాల మీద జనాల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. దీనికి తోడు ఇప్పుడు తిరుపతి గంగజాతరలో ఇలా చేయడం జగన్ అండ్ కో మీద వ్యతిరేకతను మరింత పెంచేదే.
Gulte Telugu Telugu Political and Movie News Updates