పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఒక్కసారిగా రూటు మార్చారు. కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని ప్రకటించారు. మమత ప్రకటనతో ముందు నాన్ ఎన్డీయే పార్టీలు ఆశ్చర్యపోయినా తర్వాత ఆనందం వ్యక్తంచేస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ చాలా హ్యాపీగా ఫీలవుతోంది. మమత తాజా ప్రకటనకు, వైఖరి మార్చుకోవటానికి కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించటమే అని అర్థమైపోతోంది. అంటే కర్నాటకలో కాంగ్రెస్ విజయం భవిష్యత్తులో చాలా మార్పులకు నాందిపలకబోతోందని అర్ధమవుతోంది.
ఇంతకాలం కాంగ్రెస్ పార్టీకి మమత బద్ధశతృవుగా వ్యవహరిస్తున్న విషయం అందరు చూస్తున్నదే. రాష్ట్రపతి ఎన్నికల సమయంలో తాను ప్రతిపాదించిన అభ్యర్ధి యశ్వంత్ సిన్హా విషయంలో కాంగ్రెస్ మద్దతుకోసం హస్తంపార్టీ నేతలతో మమత భేటీఅయ్యారు. అయితే ఆ తర్వాత ఉపరాష్ట్రపతి అభ్యర్ధి ఎంపిక తర్వాత తాను ఎన్నికకు దూరంగా ఉంటానని మమత ప్రకటించి అందరికీ షాకిచ్చారు. అంటే తనకు అవసరమైనపుడు కాంగ్రెస్ తో మాట్లాడుతు అవసరంలేదు అనుకున్నపుడు కాంగ్రెస్ ను దూరంగా పెట్టేస్తున్నారు.
మమత వైఖరి వల్లే నాన్ ఎన్డీయే పార్టీల్లో ముఖ్యంగా యూపీఏలో బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటు ప్రయత్నాలు ఎప్పటికప్పుడు నీరుగారిపోతోంది. అయితే తాజాగా మమత మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న రాష్ట్రాల్లో మద్దతు ఇవ్వటానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు. అయితే ఇదే సమయంలో ఒక షరతు కూడా విధించారు. అదేమిటంటే బెంగాల్లో తమ పార్టీకి కాంగ్రెస్ పోటీగా కాకుండా మద్దతుగా నిలవాలన్నారు.
నిజానికి ఇతర రాష్ట్రాల్లో తృణమూల్ కాంగ్రెస్ కున్న బలమేమీలేదు. గుజరాత్, మహారాష్ట్ర, గోవా, యూపీ లాంటి రాష్ట్రాల్లో పోటీ చేస్తోందంటే పోటీ చేస్తోందంతే. బెంగాల్ బయట ఎక్కడా మమత పార్టీకి చెప్పుకోవటానికి పట్టుమని పదీసీట్లు కూడా లేదు. తెచ్చుకుంటున్న ఓట్లు కూడా పెద్దగా లేవనే చెప్పాలి. ఇదే సమయంలో బెంగాల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్ధితి కూడా అంతంతమాత్రంగానే ఉంది. కాకపోతే ఇతర రాష్ట్రాల్లో తృణమూల్ పరిస్ధితి కన్నా బెంగాల్లో కాంగ్రెస్ పార్టీ నయమనే చెప్పాలి. మరి మమత తాజా ప్రకటనలో ఇచ్చిపుచ్చుకునే వ్యవహారం ఎలా సాగుతుందో చూడాలి.