టీడీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు మరోసారి హైదరాబాద్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. భాగ్యనగరం అభివృద్ధి తనదేనన్నారు. హైదరాబాద్ అభివృద్ధిలో విజన్ 2020 కనిపిస్తోందన్నారు. విజన్ 2020 ప్రకటించినప్పుడు కొందరు ఎగతాళి చేశారని గుర్తుచేశారు. దేశ ప్రగతిని సంస్కరణలకు ముందు.. తర్వాత అని చెప్పుకోవాలన్నారు. 25 ఏళ్లలో ప్రపంచంలో మూడో ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరిస్తుందని చంద్రబాబు పేర్కొన్నారు. దీనిలోనూ హైదరాబాద్ పాత్ర ఉంటుందని తెలిపారు.
ఇచ్చే సంవత్సరాల్లో విజన్ 2047 లక్ష్యం పెట్టుకోవాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. సంగారెడ్డి జిల్లాలోని రుద్రారంలోని గీతం యూనివర్సిటీలో కౌటిల్య స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ గ్రాడ్యుయేట్ కార్యక్రమానికి చంద్రబాబు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. విధానాల రూపకల్పన, సంస్కరణలు, పాలనలో టెక్నాలజీ అంశంపై ప్రసంగించారు. ప్రజల జీవితాలను ప్రభావితం చేయడంలో పబ్లిక్ పాలసీ కీలకమన్నారు. పబ్లిక్ పాలసీ సంస్థకు కౌటిల్య అనే మంచి పేరు పెట్టారని ప్రశంసించారు. కౌటిల్యుడి పేరు నిలబెట్టేలా విద్యార్థులు రాణించారని పిలుపునిచ్చారు.
ప్రజల జీవితాన్ని ప్రభావితం చేయడంలో పబ్లిక్ పాలసీ కీలకమని చంద్రబాబు వివరించారు. స్వాతంత్ర్యం వచ్చిన మొదట్లో అభివృద్ధి రేటు చాలా తక్కువగా ఉండేదని చెప్పారు. కొందరు విజన్ 2020ని.. విజన్ 420 అంటూ ఎగతాళి చేశారని చంద్రబాబు అన్నారు. తన విజన్ 2020 ఇప్పుడు హైదరాబాద్ అభివృద్ధిలో కనిపిస్తోందని స్పష్టం చేశారు. ఇప్పుడు విజన్ 2047 గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందని చెెప్పారు. ఎందుకంటే 2047తో దేశానికి స్వాతంత్ర్యం వచ్చి వందేళ్లవుతుందని పేర్కొన్నారు.
ఇప్పుడు మీరు న్యూ ఇండియాను చూస్తున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ క్రమంలో దేశ ప్రగతిని సంస్కరణలకు ముందు.. తర్వాత.. అని చెప్పుకోవాలని వివరించారు. 2047కు మన తలసరి ఆదాయం 26,000 డాలర్లుగా ఉండాలని తెలిపారు. ప్రస్తుతం భారతదేశం ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అని.. మరో పాతికేళ్లలో దేశం ప్రపంచంలోనే మూడో ఆర్థిక వ్యవస్థ అవుతుందని చంద్రబాబు వెల్లడించారు.
కొసమెరుపు: చంద్రబాబు ఇప్పటి వరకు ఏ యూనివర్సిటీ స్నాతకోత్సవంలోనూ పాల్గొనలేదు. పైగా ఆయన స్నాతకోత్సవ సంప్రదాయ దుస్తుల్లో మెరవడం ఇదే తొలిసారి.
Gulte Telugu Telugu Political and Movie News Updates