జనసేనాని పవన్ కళ్యాణ్.. 2019 ఎన్నికల అనంతరం బీజేజీతో జట్టు కట్టడానికి సిద్ధపడితే జనసేన పార్టీలో మెజారిటీ హర్షం వ్యక్తం చేశారు. తిరుగులేని మెజారిటీతో అధికారం చేపట్టిన వైసీపీ దూకుడును తట్టుకోవాలంటే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ అండ అవసరం అని భావించారు. తెలుగుదేశం పార్టీ అప్పటికి పతనావస్థలో ఉండటంతో బీజేపీతో ప్రయాణం మంచిదే అనుకున్నారు.
బీజీపే అండతో ఏపీలో బలపడితే ప్రధాన ప్రతిపక్షం కాగలమని జనసైనికులు ఆశించారు. కానీ వాళ్లు ఆశించింది వేరు. జరిగింది వేరు. జనసేన, బీజేపీ ఎప్పుడూ కలిసి పని చేయలేదు. జనసేనకు బీజేపీ నుంచి ఎలాంటి సహకారం అందలేదు. పైగా లోపాయకారీ ఒప్పందాలతో వైసీపీకే బీజేపీ సపోర్ట్ ఎక్కువగా లభించింది. బీజేపీతో జట్టు కట్టడం వల్ల జనసేనకు ఎలాంటి ప్రయోజనమూ దక్కలేదు. ఇదంతా చూసి బీజేజీపి వదిలించుకుంటే బెటర్ అని జనసైనికులే అభిప్రాయపడుతున్నా పవన్ మాత్రం మిత్ర ధర్మాన్ని పాటిస్తూ వచ్చాడు. మోడీ సర్కారును పల్లెత్తు మాట అనలేదు. పైగా ఎన్నికల దిశగా బీజేపీ రోడ్ మ్యాప్ కోసం ఎదురు చూస్తున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు.
కానీ గత కొన్ని నెలల్లో పవన్ వైఖరి మారింది. నెమ్మదిగా బీజేపీకి దూరం జరిగి.. టీడీపీతో జట్టు కట్టే దిశగా అడుగులు వేస్తున్నారు. కానీ మరోసారి కేంద్రంలో మోడీ సర్కారే అధికారంలోకి వస్తుందన్న అంచనాతోనో ఏమో.. బీజేపీని పూర్తిగా పక్కన పెట్టడానికి పవన్ ఇష్టపడట్లేదు. వచ్చే ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వం తమకు అండగా నిలవకపోయినా.. జగన్‌కు మోరల్ సపోర్ట్ ఇవ్వకుండా ఉండటానికి అయినా బీజేపీతో కలిసి సాగాల్సిందే అని పవన్ భావిస్తున్న సంకేతాలు కనిపించాయి.
కానీ తాజాగా కర్ణాటక ఎన్నికల ఫలితం చూశాక.. పవన్ బీజేపీ గురించి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదన్న అభిప్రాయాలు జనసేన అంతర్గత వర్గాల్లో వ్యక్తమవుతన్నాయి. ఇప్పుడు కేంద్రంలో అధికారం నిలబెట్టుకోవడానికే మోడీ అండ్ కో కష్టపడాల్సిన పరిస్థితిలో ఉందని.. ఏపీలో టీడీపీ, జనసేన పొత్తుతో సత్తా చూపించే పరిస్థితి వస్తే.. బీజేపీనే కాళ్ల బేరానికి వస్తుందని.. మొహమాటంతోనో, భయంతోనో బీజేపీ గురించి ఎక్కువ ఆలోచించాల్సిన, ఆ పార్టీతో సున్నితంగా వ్యవహరించాల్సిన అవసరం లేదనే వాదన బలంగా వినిపిస్తోంది. బీజేపీ పట్ల పవన్ మెతక వైఖరి ఇక కట్టిపెట్టి దూకుడుగా వ్యవహరించాలన్న అభిప్రాయాలను జనసైనికులే వ్యక్తం చేస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates