టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న యువగళం పాదయాత్ర 99వ రోజుకు చేరుకుంది. ఆదివారం నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలోని నల్లకాలువ పంచాయతీ పరిధిలో నారాలోకేష్ పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా మార్గమధ్యంలో నల్లకాలువ పంచాయతీ సమీపంలో ఉన్న దివంగత ముఖ్యమంత్రి, ప్రస్తుత ఏపీ సీఎం జగన్ తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి స్మృతివనం వద్ద కొద్దిసేపు ఆగి నివాళులర్పించారు.
అనంతరం నారా లోకేష్ పాదయాత్రను కొనసాగించారు. ఈ యాత్రలో మాజీ మంత్రి అమర్ నాథ్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. అయితే.. రాజకీయంగా చూస్తే.. వైఎస్ తో టీడీపీకి కూడా వైరం ఉంది. వైఎస్ జీవించిన కాలంలో కాంగ్రెస్ వర్సెస్ టీడీపీ రాజకీయాలు జోరుగా సాగాయి. చంద్రబాబు ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు 2004లో రాజశేఖరరెడ్డి పాదయాత్ర కూడా చేశారు. చివరకు చంద్రబాబును గద్దెదింపే వరకు నిద్రపోలేదు.
ఆ తర్వాత 2009లోనూ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయి.. ప్రతిపక్షంగా ఉన్న చంద్రబాబు గెలవకుండా.. ఒక అగ్ర నటుడితో పార్టీ పెట్టించారని అప్పట్లో ప్రచారం జరిగింది. ఇంత వైరం ఉన్నప్పటికీ.. చనిపోయిన నాయకులను విమర్శించరాదని.. వారిని గౌరవించాలనే సూత్రాన్ని నారా లోకేష్ పాటించడం.. తన పాదయాత్ర మార్గ మధ్యంలో వైఎస్ రాజశేఖరరెడ్డి స్మృతి వనాన్ని దర్శించి నివాళులర్పించడం.. నారాలోకేష్ రాజకీయ విజ్ఞతకు మచ్చుతనక అని టీడీపీ నాయకులు పేర్కొంటున్నారు.