చంద్ర‌బాబు నివాసాన్ని అటాచ్ చేసిన ఏపీ సీఐడీ.. ఏం జ‌రిగింది?

ఏపీ ప్ర‌భుత్వం మ‌రో వివాదాస్ప‌ద నిర్ణ‌యం తీసుకుంది. టీడీపీ అధ్య‌క్షుడు, మాజీ సీఎం చంద్ర‌బాబు నివాస‌రం ఉంటున్న ఉండ‌వ‌ల్లిలోని కరకట్టపై ఉన్న గెస్ట్‌హౌస్‌ను అటాచ్‌ చేసింది. క్రిమినల్‌ లా అమెం డ్మెంట్‌ 1944 చట్టం ప్రకారం సీఐడీ అధికారులు ఈ గెస్ట్‌హౌస్‌ను అటాచ్ చేస్తూ.. తాజాగా ఆదివారం ఉద‌యం నోటీసులు అంటించారు. దీంతో ఒక్క‌సారిగా రాజ‌కీయ అల‌జ‌డి చెల‌రేగింది.

సీఐడీ అధికారుల వాద‌న ఇదీ..

చంద్ర‌బాబు నివాసాన్ని అటాచ్‌(స్వాధీనం/జ‌ప్తు) చేసిన అధికారులు.. దీనికి కార‌ణాలు పేర్కొన్నారు. ముఖ్య మంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు, మంత్రిగా ఉన్నప్పుడు పొంగూరు నారాయణ తమ పదవులను దుర్వినియోగం చేసి క్విడోప్రోకోకు పాల్పడ్డారని ఆరోపించారు.

రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణంలో సీఆర్డీయే మాస్టర్‌ ప్లాన్‌, ఇన్నర్‌ రింగ్‌రోడ్‌ అలైన్‌మెంట్లలో అవకతవ కలకు పాల్పడి.. దానికి బదులుగా కరకట్టపై ఉన్న‌ లింగమనేని గెస్ట్‌హౌస్ క్విడ్ ప్రోకో(నాక‌ది-నీకిది) కింద‌ పొందారని అభియోగాలు మోపారు. చట్టాలను, కేంద్ర విజిలెన్స్‌ కమిషన్‌ మార్గదర్శకాలను, సాధారణ ఆర్థిక నియమాలను పూర్తిగా ఉల్లంఘించారని పేర్కొన్నారు.  

చంద్ర‌బాబు, నారాయ‌ణ‌లు తమ పదవులను ఉపయోగించుకుని బంధువులకు, సన్నిహితులకు ప్రయోజనాలు కల్పించేలా వ్యవహరించారని అభియోగాలు న‌మోదైన‌ట్టు సీఐడీ అధికారులు తెలిపారు.  రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారి లింగమనేనికి అనుకూలంగా వ్యవహరించి ప్రతిఫలంగా గెస్ట్‌హౌస్‌ తీసుకున్నారని చంద్రబాబుపై ఆరోపణలున్నాయని తెలిపారు.

ఈ నేపథ్యంలో క్రిమినల్‌ లా అమెండమెంట్‌ 1944 చట్టం ప్రకారం అటాచ్‌ చేయాలని ప్రభుత్వాన్ని తాము( సీఐడీ) కోరిన‌ట్టు అధికారులు అంటించిన నోటీసులో పేర్కొన్నారు. త‌మ విజ్ఞ‌ప్తికి రాష్ట్ర ప్రభుత్వం చట్ట ప్రకారం అంగీక‌రించింద‌ని, దీంతో చంద్రబాబు గెస్ట్‌హౌస్‌ను అటాచ్ చేసిన‌ట్టు పేర్కొన్నారు. కానీ, ఈ విష‌యాన్ని ముందుగానే  స్థానిక జడ్జికి సమాచారం ఇచ్చిన‌ట్టు సీఐడీ అధికారులు నోటీసులో వివ‌రించారు. దీనిపై టీడీపీ నాయ‌కులు ఇంకా స్పందించ‌లేదు.