ఏపీ సీఎం జగన్ విషయంలో ఆయన పొరపాటు ఉందా.. లేదా.. ఆయన ఆదేశాలు ఉన్నాయా? లేవా? అనే విషయాన్ని పక్కనపెడితే క్షేత్రస్థాయిలో అధికారులు, పోలీసులు చేస్తున్న అతి.. నేరుగా సీఎం జగన్ పీకకు చుట్టుకుంటోందనే వాదన బలంగా వినిపిస్తోంది. నిజానికి చెట్లు కొట్టేయాలని సీఎం జగన్ ఆదేశించి ఉండకపోవచ్చు. ఎందుకంటే..ఆయన ఉంటున్న ఇంట్లోనే వందలకు వందల చెట్లు పెంచుతున్నారు.
కానీ, సీఎం జగన్ పర్యటనలు చేస్తున్న సమయంలో మాత్రం ఆయా ప్రాంతాల్లో వృక్షాలను, చెట్లను కూకటి వేళ్లతో సహా మునిసిపల్ సిబ్బంది తొలగించేస్తున్నారు. దీనిపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. దీనిపై తాజాగా జాతీయ హరిత ట్రైబ్యునల్ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. చర్యలు తీసుకునేందుకు రెడీ అయిందని కూడా సమాచారం. దీంతో ఈ విషయంపై సీఎం జగన్ చిక్కుకున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది.
ఇదిలావుంటే.. తనను కనీసం.. బహిరంగ ప్రదేశాల్లో పర్యటనలకు వచ్చినప్పుడు అయినా.. కలుసుకోవాలని.. దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బందులు పడుతున్న రోగులు ప్రయత్నిస్తున్నారు. ఆరోగ్య శ్రీ పథకంలో లేని వ్యాధులకు సంబంధించి ఆయా వివరాలు నేరుగా సీఎం కు చెప్పి.. ఎంతో కొంత డబ్బులు ఆశించి సాయం కోరే వారు పెరుగుతున్నారు. అయితే.. వీరిని అదికారులు సీఎం వద్దకు అనుమతించక పోవడం గమనార్హం. ఇది కూడా బ్యాడ్ నేమ్ తెస్తోంది.
ఎవరైనా ఒకరిద్దరు.. కాన్వాయ్‌లో నుంచి తనకు కనిపిస్తే మాత్రమే సీఎం జగన్ స్పందిస్తున్నారు.. వారికి సాయం అందిస్తున్నారు. ఇక, మరో విషయం.. ప్రజలు తమ సమస్యలు చెప్పుకొనేందుకు సీఎం జగన్ వద్దకు వస్తున్నారు. అయితే.. వీరిలో ప్రజాసంఘాల నాయకులు, బీజేపీ, టీడీపీ నేతలు కూడా ఉంటున్నారు. అయితే.. అసలు విషయం కూడా తెలుసుకోకుండానే పోలీసులు వీరిపై ఉక్కుపాదం మోపడం .. ప్రభుత్వానికి మాయని మచ్చలుగా మిగులుతున్నాయి. మొత్తానికి ఎన్నికల సమయంలో ఈ అతికి.. సీఎం జగన్ ముకుతాడు వేయాలని అంటున్నారు పరిశీలకులు.
Gulte Telugu Telugu Political and Movie News Updates