ఏపీ బీజేపీకి పొత్తులే శ‌ర‌ణ్యం?

ఏపీలో పుంజుకోవాల‌న్నా.. క‌నీసం.. ఉనికిని నిలబెట్టుకోవాల‌న్నా.. బీజేపీకి ముందున్న ఏకైక మార్గం.. పొత్తు లేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఇమేజ్ త‌మ‌ను కాపాడుతుంద‌ని.. ఏపీలో నూ త‌మ‌ను గ‌ట్టెక్కిస్తుంద‌ని ఆశ‌లు పెట్టుకుని.. ఇలానే పొత్తుల విష‌యంలో భీష్మించుకుని కూర్చుంటే.. మొత్తానికే మోసం ఖాయ‌మ‌ని అంటున్నారు. క‌ర్ణాట‌క ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ కాలికి బ‌ల‌పం క‌ట్టుకుని తిరిగారు.

ఢిల్లీ టు బెంగ‌ళూరు, ఢిల్లీ టు మైసూరు అంటూ.. 19 సార్లు ఆయ‌న కేవ‌లం 25 రోజుల్లో ప‌ర్య‌టించారు. అంతేకాదు.. 6 ప్ర‌ధాన రోడ్ షోలు చేశారు. వీటిలో రెండు ఏకంగా 8 గంట‌ల పాటు సాగాయి. ఇక‌, 5 బ‌హిరంగ స‌భ‌ల్లో 4 గంట‌ల 50 నిమిషాల పాటు ప్ర‌సంగించారు. మొత్తంగా రాష్ట్ర ఎన్నిక‌ల‌ను ఆయ‌న త‌న అధీనంలో కి తీసుకున్నారు. త‌న ఇమేజ్‌తో పార్టీని గెలిపిస్తాన‌నే ధీమా వ్య‌క్తం చేశారు. అదేస‌య‌మంలో టిప్పు సుల్తాన్ రాజ‌కీయాలు తీసుకువ‌చ్చారు. హిజాబ్ స‌హా ముస్లిం రిజ‌ర్వేష‌న్ల‌ను ఎత్తేయ‌డం ప్ర‌స్తావించారు.

మొత్తంగా చూస్తే.. మోడీ ఇమేజ్ స‌హా ఆయ‌న ప్ర‌క‌టిత ప‌థ‌కాలు త‌మ‌ను విజ‌య‌తీరాల‌వైపు తీసుకువెళ్తా య‌ని అనుకున్నారు. కానీ, క‌న్న‌డిగులు మోడీని న‌మ్మ‌లేదు. బీజేపీకి ఘోర ప‌రాభ‌వాన్ని క‌ట్ట‌బెట్టారు. ఈ ఫ‌లితాల అనంత‌రం.. ఇక‌, ఇప్పుడు తేలిపోయిన విష‌యం ఒక్క‌టే ఒక్క‌టి .. మోడీతో బీజేపీ ఇమేజ్ పెర‌గేది లేదు. క్షేత్ర‌స్థాయి బ‌లం.. కార్య‌క‌ర్త‌లు.. వ్యూహాలే పార్టీని ముందుకు న‌డిపిస్తాయ‌నేది స్ప‌ష్ట‌మైంది.

ఈ నేప‌థ్యంలో 2024లో జ‌ర‌గ‌నున్న లేదా.. అంత‌క‌న్నా ముందే వ‌స్తాయ‌ని భావిస్తున్న ఏపీలో బీజేపీ ఏవిధంగా అడుగులు వేయాల‌నే విష‌యంపై ఇప్పుడు చ‌ర్చ జ‌రుగుతోంది. నిన్న మొన్న‌టి వ‌ర‌కు తాము జ‌న‌సేన‌తో త‌ప్ప ఎవ‌రితోనూ క‌లిసి న‌డిచేది లేద‌ని చెప్పిన‌.. బీజేపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజు తాజాగా టంగ్ మార్చారు. జ‌న‌సేన అధినేత చెప్పిన పొత్తుల విష‌యాన్ని పార్టీ పెద్ద‌ల దృష్టికి తీసుకువెళ్తాన‌న్నారు. మ‌రి ఆ దిశ‌గా అడుగులు వేస్తేనే.. పొత్తుల దిశ‌గా పావులు క‌దిపితేనే.. బీజేపీ ఇమేజ్ ఏమైనా నిల‌బ‌డుతుంద‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు.