ఆయన మూడేళ్ల పాటు మంత్రిగా చేశారు. వైసీపీలో తిరుగులేని నాయకుడని అనిపించుకున్నారు. ఇప్పుడు మాత్రం పక్క చూపులు చూస్తున్నారు. మనకొద్దీ వైసీపీ అనుకుంటూ కాషాయ కండువా కప్పుకునేందుకు రెడీ అవుతున్నారు.
అవంతీ శ్రీనివాస్. ఉత్తరాంధ్రలో, అందులోనూ వైసీపీలో నిన్న మొన్నటి దాకా కీలక నేత. సాధారణంగా పదవి పోతే ఏ నేతకైనా ప్రాధాన్యం తగ్గడం సహజమే కానీ అవంతి పరిస్థితి దారుణంగా ఉంది. సొంతపార్టీ నాయకులు కూడా పలకరించడం లేదు. పొమ్మనలేక పొగబెడుతున్నారని ఇప్పటికే ఆయనకో స్పష్టత వచ్చేసింది. జిల్లాలో ఆయనకు గౌరవం దక్కడం సంగతి పక్కన పెడితే.. సొంత నియోజకవర్గంలోనే అవమానాలు ఎదురవుతున్నాయి. అసలు వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ సీటు ఉంటుందా ఉండదా అనే చర్చ కూడా వచ్చేసింది.
గత ఎన్నికలకు ముందు వైసీపీలోకి వచ్చిన అవంతి 2019లో అధికారంలోకి వచ్చాక.. మూడేళ్లపాటు ఉమ్మడి విశాఖ జిల్లాలో జిల్లాలో ఏకైక మంత్రిగా ఉన్నారు. ఆ కాలంలో ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో పట్టుకోసం ప్రయత్నం చేశారనే వాదన ఉంది. కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణలో మంత్రి పదవి పోయాక.. అవంతికి విశాఖ జిల్లా వైసీపీ బాధ్యతలు అప్పగించారు. కానీ.. వ్యక్తిగత వ్యవహారాల కారణంగా వైసీపీ జిల్లా అధ్యక్ష పదవి కూడా మూణ్ణాళ్ల ముచ్చటే అయ్యింది. మాజీ మంత్రి ప్లేస్‌లో జిల్లా వైసీపీ పగ్గాలు మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబుకు అప్పగించారు. ఆయన బాధ్యతలు చేపట్టిన వెంటనే అవంతి వర్గం మొత్తం పక్కకు వెళ్లాల్సి వచ్చింది. తన వర్గాన్ని పక్కన పెట్టడం మాజీ మంత్రికి మింగుడు పడలేదు. ఆ తరువాత పార్టీ ఆఫీసు గుమ్మం తొక్కడం తగ్గించేశారు. ఇదే సందు అనుకుని ఆయనను అసలు పిలువడం మానేశారు
ఆ మధ్య బయటకు వచ్చిన ఆడియో టేపులతో అవంతి పరువు పోయింది.ఇక వైసీపీలో ఉండి ప్రయోజనం లేదని అవంతి అనుకున్నారట. టీడీపీలో చేరే అవకాశం లేకపోవడంతో బీజేపీ వైపు చూస్తున్నారని చెబుతున్నారు. కమలం పార్టీకి కూడా నాయకులు కావాల్సి రావడంతో ఎలాంటి షరతులు లేకుండా చేర్చుకునేందుకు సిద్ధమవుతోందని చెబుతున్నారు.