కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఆది నుంచి కూడా హంగ్ ఏర్పడుతుందని.. ఏ పార్టీకి పెద్దగామెజారిటీ రాదని భావించిన రాష్ట్రంలో దాదాపు 38 ఏళ్ల చరిత్రను తిరగరాస్తూ.. కాంగ్రెస్ సంపూర్ణ మెజారిటీ దిశగా దూసుకుపోతోంది. దాదాపు 130 స్థానాలకు పైగా కాంగ్రెస్ దక్కించుకునే అవకాశం కనిపిస్తోంది. ఇది ఎలా ఉన్నప్పటికీ మేజిక్ ఫిగర్ అంటే.. అసెంబ్లీలో అధికారం దక్కించుకునేందుకు కావాల్సిన సీట్ల సంఖ్య 113 దాటిపోవడంతో కాంగ్రెస్ పార్టీ ఊపిరి పీల్చుకుంది.
వరుస వివాదాలు, చిక్కులు, అంతర్గత కుమ్ములాటలు.. వెరసి కాంగ్రెస్ పార్టీని చుట్టుముట్టిన సమస్యల నుంచి కర్ణాటక ఫలితం ఒకింత తెరిపి ఇవ్వడమే కాదు.. భారీగా భరోసా కల్పించిందనడంలో సందేహం లేదు. నిజానికి కాంగ్రెస్ మేనిఫెస్టోపై బీజేపీ పెద్దలు.. మోడీ సహా అమిత్ షా వంటి నాయకులు పెద్ద ఎత్తున యుద్ధమే చేశారు. బజరంగదళ్ సంస్థను నిషేధిస్తామన్న హామీపై నిప్పులు చెరిగారు. ఎన్నికలసమయానికి దీనినే ఆయుధంగా తీసుకువెళ్లారు.
అయితే.. ఎట్టకేలకు ప్రజాతీర్పు బీజేపీకి భారీ వ్యతిరేకంగాను అదేసమయంలో అంచనాలకన్నా ఎక్కువగా కాంగ్రెస్‌కు అనుకూలంగాను రావడంతో హస్తం పార్టీ నేతల్లో హుషారు కనిపిస్తోంది. నిజానికి గతంలోనూ గోవా, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్ బొటాబొటి స్థానాలతో విజయం దక్కించుకున్నా.. అప్పట్లో ఫిరాయింపులను ప్రోత్సహించిన బీజేపీ.. అక్కడ ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో కర్ణాటకలో ఆది నుంచి కూడా కాంగ్రెస్ సంపూర్ణ మెజారిటీపైనే ఆశలు పెట్టుకుంది.
తాజాగా వచ్చిన ఫలితం.. నిజానికి కర్ణాటక కాంగ్రెస్ నేతలు కూడా ఊహించి ఉండరు. గత శుక్రవారం రాత్రి వరకు. అంటే.. ఫలితం వెలువడడానికి 24 గంటల ముందు వరకు కర్ణాటక కాంగ్రెస్ నేతలు 120 లోపు స్థానాలపైనే ఆశలు పెట్టుకున్నారు. అయితే.. తాజా ఫలితం మాత్రం అంతకుమించి అన్నట్టుగా ముందుకు దూసుకుపోవడం.. నిజంగానే కాంగ్రెస్ హిస్టరీలోనే కాదు.. కర్ణాటక హిస్టరీలోనే మైలు రాయిగా మారనుంది.